పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/65

ఈ పుట ఆమోదించబడ్డది

4. శిష్యలక్షణాలు

బైబులు భాష్య - 44

మనవిమాట

నేటి మన క్రైస్తవజీవితం వట్టి చౌకబారురకమై పోయింది. మనందరిలోను చిత్తశుద్ధి లోపిస్తూంది. నేడు క్రీస్తు బోధలప్రకారం జీవించే క్రైస్తవులు కరవైపోయారు. ఈలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభువు ఉద్దేశించిన నిజశిష్య లక్షణాలనూ తొలినాటి క్రైస్తవులు ఆ లక్షణాలకు అనుగుణంగా జీవించిన తీరునూ ఓ మారు స్మరించుకోవడం లాభదాయకం ఔతుంది. ప్రభువు అడుగుజాడల్లో నడవడం క్రైస్తవ శిష్యుడి ధర్మం. ఈ చిన్ని పొత్తం అ ప్రేరణనే కలిగిస్తుంది.

విషయసూచిక

1. శిష్యలక్షణాలు
2. శిష్యధర్మాలూ పర్వతప్రసంగమూ
3. శిష్యధర్మమూ ఆచరణశుద్దీ

1. శిష్యలక్షణాలు

1. శిష్యులంటే యెవరు?

క్రీస్తుకి చాల వర్గాల శిష్యులు ఉండేవాళ్ల. సువిశేషాల్లో కనీసం మూడు వర్గాలనైనా గుర్తించవచ్చు. అందరికంటె ముఖ్యలు 12 మంది శిష్యులు - మత్త 10,1. వీళ్లుకాక డెబ్బెమంది అనే పేరుతో మరోవర్గంవాళ్లు కూడ వున్నారు - లూకా 10,1. ఇంకా కొన్ని తావుల్లో అతనికి గొప్ప శిష్యవర్గం వుండేదని చెప్పబడింది - లూకా 6, 17. కాని ఈ వార్గలన్నీ శిష్య వృత్తిలో ఎక్కువకాలం కొనసాగలేదు. ప్రభువు కొంచెం కటువైన బోధలు చేయగానే చాలమంది జారుకొన్నారు. ఓమారు అతడు తన శరీరాన్నే ఆహారంగా యిస్తానని చెప్పాడు. శిష్యులు ఈ వాక్యాన్ని అపార్థం చేసికొన్నారు. అది వాళ్లకు వెగటుగా తోచింది. అప్పటినుండి చాలమంది అతన్ని అనుసరించడం మానివేసారు - యోహా 6, 66.

ఉత్థాన క్రీస్తు తన్ను గూర్చి బోధించమని శిష్యులకు ఆజ్ఞ యిచ్చాడు. జనులను తన శిష్యులనుచేసి వాళ్లు తన ఆజ్ఞలను పాటించేలా చేయమని చెప్పాడు. వాళ్లకు జ్ఞానస్నానం ఈయమని అదేశించాడు - మత్త 28,19. ఈలా తయారైన జనులు ఎప్పడుగూడ క్రీస్తుశిష్యులేకాని మన శిష్యులు కాదు. కనుక వాళ్లను మన దగ్గరికి కాదు క్రీస్తు దగ్గరికి రాబట్టాలి.