పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

పర్యవసానాలు

1. భగవంతుడు పురుషుడూ కాదు, స్త్రీకాదు. దేవుడు దేవుడే. ఐనా ఆ సృష్టికర్త ప్రీపురుషులను ఇద్దరినీ తనకు పోలికగా చేసాడు. కనుక స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించిన గుణం ఏదో అతనిలో ఉండాలి. కనుక అతన్ని మన భాషలో తండ్రి అనడం ఎంత ఉచితమో తల్లి అనడం కూడ అంత ఉచితం. కనుకనే ప్రపంచంలోని నానామతాల భక్తులు అతన్ని ఈ రెండు పేర్లతోను సంబోధించారు.

2. కొందరికి దేవుణ్ణి తండ్రి అని పిల్చినప్పటికంటె తల్లి అని పిల్చినప్పడే ఎక్కువ భక్తి ప్రేమ పడతాయి. ఈలాంటివాళ్ళు నిరభ్యంతరంగా అతన్ని తల్లినిగా భావించుకోవచ్చు

3. చిన్నపిల్లలకు బోధించేపుడు తల్లిదండ్రులు దేవునితో సమానం అని చెప్తాం. చిన్న బిడ్డలు మొదట గుర్తించేది అమ్మా నాన్నలనే. వారికి కొంత ప్రాయం వచ్చి ఆయా విషయాలు అర్థంజేసికొనే శక్తి రాగానే మనం వారికి దేవుణ్ణి అమ్మనుగాను నాన్ననుగాను పరిచయం జేయడం మంచిది. జ్ఞానోపదేశంలోను బైబులు బోధలోను వారికి దేవుడు అమ్మా నాన్న రెండూ అని చెప్పాలి.

4. మన ఆరాధనలో, ప్రార్థనల్లో పాటల్లో దేవుణ్ణి తల్లీ తండ్రిగా భావించుకోవాలి. మన ప్రార్థనలను "తల్లీ తండ్రివీ ఐన దేవా" అని ప్రారంభించడం మంచిది. మన ప్రసంగాల్లో వడకాల్లో అతన్ని తల్లీ తండ్రినిగా చూపించాలి.

5. దైవశాస్త్రం క్రీస్తు గుణగణాలనూ అతడు దయచేసిన రక్షణాన్నీ వివరిస్తుంది. క్రీస్తులో మనకు ప్రధానంగా కన్పించే గుణం కరుణ, ప్రేమ, కాని ఈ గుణాలు తల్లిలోనే ఎక్కువగా ఉంటాయి. కనుక దైవశాస్త్రరీత్యా అతన్ని తల్లిగా భావించడం ఉచితమే.

6. భగవంతుడు అన్ని వస్తువుల్లోను ఉంటాడు. ప్రధానంగా మన హృదయంలో ఉంటాడు. కనుకనే మన దేశ ఋషులు అతన్ని "అంతర్యామి" అన్నారు. మన తరపున మనం మన హృదయగుహలోనికి ప్రవేశించి అక్కడ కొలువున్న ప్రభువుని గుర్తించాలి. బిడ్డ తల్లికి చేరువగా ఉంటుంది. భక్తుడుకూడ భగవంతునికి దగ్గరగా ఉండాలి. కాని అతన్ని తల్లినిగా భావించుకొన్నపుడు ఈ దగ్గరితనం ఇంకా యొక్కువొతుంది. తల్లిపట్ల మనకుందే అనురాగం ఆప్యాయత ఎంతో గొప్పది కదా!

7. బైబుల్లోగాని, క్రైస్తవ సంప్రదాయంలోగాని దేవుణ్ణి మామూలుగా తండ్రి అనే పేర్కొన్నారు. కనుక ఒకవిధంగా చెప్పాలంటే, మనకు తల్లిలేదు. ఈ కొరతను మన క్యాతలిక్ సమాజంలో మరియమాత కొంతవరకు తీరుస్తుంది. మరియను గౌరవించడం ఉచితమే. కాని ఆమె కేవలం మానవమాతృరాలైన తల్లి, దైవత్వాన్ని పొందిన తల్లి కాదు.

8. హిందూమతంలో సరస్వతి, లక్ష్మి పార్వతి మొదలైన స్త్రీమూర్తులున్నారు. వీళ్ళ నరమాత్రులుకాదు, దైవత్వంకల స్త్రీదేవతలు ఈలాంటివాళ్ళ ఎవరూ మన క్రైస్తవమతంలో లేరు. మనం తల్లినిగా ఎంచి కొల్చే భగవంతుడుకాని, మనం గౌరవించే మరియమాతకాని పై స్త్రీ దేవతల్లాంటివాళ్ళకాదు. ఈ యంశాన్ని మన ప్రజలు స్పష్టంగా గ్రహించాలి.