పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

1. పూర్వవేదం

బైబులు భగవంతుడైన యావేకు భార్య లేదు, లింగం లేదు. అసలు అతడు శరీరధారి కాదు. కేవలం ఆత్మస్వరూపుడు.

ఈ భగవంతుడు నరుణ్ణి తనకు పోలికగా చేసాడు. భగవంతుని రూపం, శక్తి, అంశ అతనిలోకి ప్రవేశించాయి. దేవుడు నరుణ్ణి తనకు పోలికగా చేస్తే, నరులు దేవుణ్ణి తమకు పోలికగా ఊహించుకున్నారు. ప్రాచీన యిస్రాయేలు భక్తులు దేవునికి ఎన్నో పోలికలు చెప్పారు. అతన్ని సృష్టికర్త, రాజు, రక్షకుడు, తండ్రి, భర్త యజమానుడు, స్నేహితుడు, యుద్ధవీరుడు, న్యాయాధిపతి మొదలైన పేర్లతో పిలిచారు. కాని ఈ పేర్లన్నీ కూడ అతడు పురుషుడని తెలియజేస్తాయి. ఐతే నరులు స్త్రీపురుషులుగా ఉంటారు కదా? మరి మనలోని స్త్రీత్వం ఆ భగవంతుల్లో లేదా?

బైబులు రచయితలంతా మగవాళ్ళు. కనుక వాళ్ళు అప్రయత్నంగానే దేవునికి పురుషత్వం ఆరోపించారు. అతన్ని పురుషుణ్ణిగా వర్ణించుకొంటూ పోయారు. కాని పురుషుల్లోకూడ కొంత స్త్రీత్వం వుంటుంది. కనుక ఈ సహజావబోధనంవల్ల వాళ్ళ భగవంతుణ్ణి అక్కడక్కడ స్త్రీనిగా కూడ చిత్రించారు.

బైబులు రచయితలు దేవునికి స్త్రీత్వాన్ని ఆరోపించిన సందర్భాలు కొద్దే ఐనా ఈ స్వల్ప సందర్భాలు కూడ నేడు మనకెంతో పేరణను పుట్టిస్తాయి. మహిళా విమోచనోద్యమం ముమ్మరంగా సాగిపోతున్న రోజులివి. కనుక బైబులు భగవంతుల్లోని స్త్రీత్వాన్ని చూచి స్త్రీలు ప్రేరణం పొందుతారు. ఆ ప్రభువు తమ్మ అనాదరం చేయలేదని సంతోషిస్తారు. ఒక్క స్త్రీలేకాదు, పురుషులుకూడ దేవుళ్ళొ స్త్రీత్వాన్నీ మాతృత్వాన్నీ చూచి ఆనందిస్తారు. కాని ముందే చెప్పినట్లు బైబులు భగవంతుడు శరీరధారి కానేకాదు. అతడు మన లింగానికి లొంగేవాడు కాదు. పరిశుద్ధ రచయితలు అతన్ని స్త్రీనిగానో పురుషుణ్ణిగానో చిత్రించడం అతడు మనకు అర్థంకావడం కొరకే. నిజానికి అతడు పురుషుల్లో, ఎవరూ కాదు. ఈ గుణాలు కేవలం రచయితల ఊహలు, ఉత్రేక్షలు అంతే. మొదటలోనే పాఠకులు ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక, బైబులు దేవునికి చాల స్త్రీరూపాలు ఆరోపిస్తుంది. తల్లి, గర్భిణి, మంత్రసాని, యజమానురాలు, దాది, వస్తాలు నేసే మొదలైన ప్రతీకలను భగవంతునికి వాడుతుంది. వీటిని క్రమంగా పరిశీలిద్దాం.