పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. జీవితంలో జ్ఞానం కంటె ఆచరణ ముఖ్యం. కొందరు క్రీస్తు బోధలన్నీతెలిసినా వాటిని పాటించరు. సోమరితనమో, స్వార్ధమో, అహంకారమో అడ్డు తగులుతుంది. ఈలాంటివాళ్ళకు రక్షణ లేదు- మత్త 7,21.

3. మనలను రక్షించేది ప్రధానంగా జ్ఞానం కాదు, ఆచరణం. నరుడు తనకున్న స్వేచ్ఛ వలన మంచినైనా ఎన్నుకోవచ్చు, చెడ్డనైనా ఎన్నుకోవచ్చు. కొందరు పునీతులు గొప్ప జ్ఞానులేమి కాదు. ఐనా తమకు తెలిసింది ఆచరించి రక్షణం పొందారు. కొందరు జ్ఞానులై కూడ తమ స్వేచ్ఛను దుర్వినియోగం జేసికొని మంచిని విడనాడి నాశమయ్యారు. కనుక క్రీస్తు ఉపదేశాలు పాటించడం ముఖ్యం. పరిసయులకు ధర్మశాస్త్రం తెలుసు. దాని మిూద వ్యాఖ్య తెలుసు. ఐనా వాళ్ళు ధర్మశాస్తాన్ని ఇతరులకు బోధించారే గాని తాము ఆచరించలేదు - మత్త23,3. అలాగే బైబులూ ధర్మశాస్త్రమూ క్షుణ్ణంగా తెలిసిన గురువులూ మఠకన్యలూ ఆచరణం లేక చేటుదెచ్చుకోవచ్చు. ఏ శాస్త్రమూ తెలియని సామాన్యక్రైస్తవులు ఆచరణం వల్ల రక్షణం పొందవచ్చు.

4. మనం క్రీస్తు బోధల ప్రకారం జీవించాలి. కాని అతని బోధలు కష్టమైనవి. ఆవి చాల ఉన్నాయి కూడ. కాని వాటి నన్నిటినీ ఒక్కరోజులోనే పాటించం. కొన్నిసార్లు ఆచరణలో విఫలులమై పడిపోతాం గూడ. ఐనా క్రీస్తు వరప్రసాద బలంతో మనకు చేతనైనంతవరకూ రోజూ వాటిని పాటిసూనే వుండాలి. ఆధ్యాత్మిక రంగంలో పరుగెత్తనక్కరలేదు. స్థిరంగా నడిస్తే చాలు.

5. క్రీస్తు ఆజ్ఞలను పాటించడంలో కాలయాపనం చేయకూడదు. చాలసార్లు క్రీస్తు వరప్రసాదం నీవు ఈ తప్పను సవరించుకో, ఈ మంచి కార్యం చేయి అని మనలను ప్రేరేపిస్తుంది. కాని మనం ఆ కార్యం రేపు చేయవచ్చులే అనుకొంటూం. కాని రేపటికల్లా ఆ వత్సాహం నశిస్తుంది. జాప్యం వల్ల ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది. వరప్రసాదం గాలివాటు లాంటిది. ఒకసారి పోతే మల్లా రాదు. కనుక అది మనలను ప్రేరేపించగానే పనికి పూనుకోవాలి. లేకపోతే నష్టపోతాం. దైవసేవలో మంచి కోరికలూ ఆలోచనలూ చాలవు. మంచి క్రియలు కావాలి. క్రియారూపం దాల్చని కోరిక తల్లి కడుపులోనే చనిపోయిన పిండం లాంటిది.

6. క్రీస్తు ఉపదేశం ప్రకారం జీవిస్తే బ్రతుకుతాం, లేకపోతే చస్తాం. అతడు తన ఆజ్ఞలను పాటించమని ఖండితంగా చెప్పాడు. దానికిక తిరుగులేదు. సువిశేష బోధలు మనకు నిత్యజీవమిస్తాయి - యోహా 6,68. రోజువారి జీవితంలో ఈ బోధలను పాటించి జీవాన్ని పొందేవాళ్ళెవరో, పాటించక చావును తెచ్చుకొనేవాళ్ళెవరో మనం గమనిస్తూనే ఉంటూo.