పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/220

ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే మెస్సియా రాకడకూడ రక్షణ కాలాన్ని సూచిస్తుంది. అతని రాకడతో ప్రజలకు రక్షణం లభించినట్లే.

ఆనాడు ప్రభువు శారీరకంగా వచ్చి ప్రజలకు రక్షణం ప్రసాదించాడు. ఈనాడు కూడ అతడు ఆధ్యాత్మికంగా వచ్చి రక్షణ ఇస్తూంటాడు. అతడు మన హృదయమనే తలుపు వద్దకు వచ్చి మెల్లగా తడతాడు. కాని హృదయ కవాటం విప్పి ఆ ప్రభువుని అంతరంగంలో ప్రవేశపెట్టుకొనే బాధ్యత మనది - ప్రక 3,20.

5. పిశాచ పతనం = లూకా 10,18.

ప్రభువు డెబ్భది ఇద్దరు శిష్యులను ప్రేషిత ఉద్యమం విూద పంపాడు. వాళ్ళు తిరిగివచ్చి మేము పిశాచాలను పారద్రోలామని చెప్పారు. అందుకు ప్రభువు సంతసించి పిశాచం ఆకాశం నుండి మెరుపు తీగలా పడిపోతుంటే నేను చూచాను అన్నాడు. అనగా క్రీస్తూ అతని శిష్యులూ చేసే బోధల వల్లా అద్భుతాల వల్లా పిశాచమూ దాని సామ్రాజ్యమూ కూలిపోయి దైవరాజ్యం వ్యాప్తిలోకి వచ్చింది అని భావం. మెస్సీయా వచ్చిందాకా పిశాచం ఈలోకానికి అధిపతి. ఆ దుష్టశక్తి ఈ ప్రపంచంలోని జనాన్ని పాపానికి పరికొల్పింది. కాని ప్రభువు విజయం చేసాక ఆ నాయకుడు పదవీభ్రష్టుడయ్యాడు. వానికి మారుగా ప్రభువు ఈ లోక నాయకుడయ్యాడు - యోహా 12,31.

మన హృదయ సామ్రాజ్యంలో ప్రభువుకి ఓడిపోయిన పిశాచం గాదు, ఆ పిశాచాన్ని జయించిన ప్రభువు నివసిసూండాలి.

6. బలవంతుని జయించిన బలవంతుడు = లూకా 11,21-22

ఓ బలాఢ్యుడు ఉన్నాడు. అతడు తనకంటె బలవంతుడు లేడని విర్రవీగుతున్నాడు. ఓ దినం అతని కంటె బలాఢ్యుడు వచ్చి అతనితో పోరాడాడు. ఈ రెండవ బలాఢ్యుడు ఆ మొదటివాణ్ణి జయించి వాని పెడరెక్కలు విరిచికట్టాడు. వాని యిల్లు దోచుకొన్నాడు. ఇక్కడ మొదటి బలవంతుడు పిశాచమే. అతన్ని జయించిన రెండవ బలవంతుడు క్రీస్తు. పిశాచం క్రీస్తుకు ఓడిపోయి పూరిమేసింది.

క్రీస్తుతో దైవసామ్రాజ్యం ప్రారంభమై పిశాచ సామ్రాజ్యం పడిపోయిందని చెప్పాం. నా పిశాచ రాజ్యం పూర్తిగా అంతరించలేదు. ఈనాడు కూడ మనం పాపం చేసినపుడు పిశాచం మన హృదయంలో సామ్రాజ్యం నిర్మించుకొంటుంది. పాపం చేసినప్పడల్లా మనం పిశాచంతో నీ రాజ్యమే వచ్చునుగాక అని చెప్పినట్లవుతుంది.

7. ఇంటి యజమానుడు = మత్త 13, 52

ఓ గృహస్థ ఉన్నాడు. అతని కోశాగారంలో విలువ గల పాత వస్తువులూ క్రొత్త వస్తువులు గూడ ఉన్నాయి. అతడు వాటినన్నిటిని వెలుపలికి తీసుకొని వచ్చి ప్రేక్షకులకు