పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/213

ఈ పుట ఆమోదించబడ్డది

పెండ్లిండ్లు రాత్రి ప్రొద్దు పోయిందాకా వాదవివాదాలతో సాగిపోతుండేవి. ఈ కథలో గూడ ఈలాంటి పరిస్థితినే ఊహించుకోవాలి.

సరే, వరుడు వధువు ఇంటికి రావడంలో ఆలస్యం జరిగింది. కనుక ఆ పదిమంది యువతులూ దివిటీలు ఆర్చి ప్రక్కనబెట్టి కాస్త కన్నుమూసి కునికిపాట్ల పడుతూన్నారు. అప్పుడు అర్థరాత్రిలో అకస్మాత్తుగా పెండ్లి కుమారుడు వస్తున్నాడనే కేకలు విన్పించాయి. యువతులంతా అతనిని ఎదుర్కొని స్వాగతం చెప్పడానికి వెళ్ళారు. కాని వాళ్ళల్లో ఐదుగురు నూనెబుడ్లతో రాలేదు. ఆ రోజుల్లో దివిటీలు పట్టుకొనేవాళ్లు నూనెను కూడ చిన్న కూజాల్లో తెచ్చుకొనేవాళ్ళ ప్రతి పదిహేను నిమిషాల కొకసారి దివిటీల విూద చమురు పోసేవాళ్ళ.

చమురు కూజాలు లేకుండా వచ్చిన కన్నెలు చివరి గడియల్లో నూనె కోసం గాబరాపడ్డారు. తోడి యువతులను అడిగారు. కాని ఫలితం లేకపోయింది. కనుక కంగారుతో అంగడికి పరుగెత్తారు. కాని అంతలోనే పెండ్లి కుమారుడు వచ్చాడు. నూనె ఉన్న ఐదుగురు కన్నెలూ తమ దివిటీలు వెలిగించుకొని ఎదురు వెళ్ళి అతనికి స్వాగతం పలికారు, పెండ్లి కుమారుణ్ణి అతని వధువునీ అనుసరించి వరుని యింటికి వెళ్ళారు. అక్కడ పెండ్లి జరుగుతూంది.

కొంచెం సేపయ్యాక మందమతులైన కన్నెలు గూడ అంగడిలో నూనె కొనుక్కొని, దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుని యింటికి వచ్చి చేరారు. ఆ యింటి తలుపు తట్టారు. కాని అప్పటికే వివాహశాలను మూసివేసారు. కనుక వాళ్ళకు ప్రవేశం లభింపలేదు. పెండ్లి కుమారుడు కూడ విూతో నాకు ఏమిూ సంబంధం లేదు పొండని వాళ్ళకు ప్రవేశం నిరాకరించాడు.

2. భావం

ఇక్కడ ఈ యైదుగురు మందమతులైన కన్నెల తప్ప నిద్రపోవడం గాదు. వివేకవతులైన కన్నెలు గూడ నిద్రపోయారు గదా! మరి మిగులునూనె లేకుండా రావడం వీళ్ళ తప్ప. ఈ కన్నెల్లాగాకుండా క్రైస్తవ శిష్యులు ప్రభువు రెండవ రాకడకు సిద్ధంగా ఉండాలి. ఆ ప్రభువు ఎప్పడు విజయం చేస్తాడో మనకు తెలియదు. అతడు ఎప్పడో హఠాత్తుగా వస్తాడు. అలాంటి రాకడకు మనం తయారుగా ఉండాలి — ఇది భావం.

క్రీస్తునాడు క్రైస్తవులు లేరు. అతడు మొదట సామెతలను విన్పించింది క్రైస్తవులకు గాదు, యూదులకు, కనుక మొదట ఈ సామెత చెప్పినప్పడు క్రీస్తు ఉద్దేశించిన భావం ఇది. పరలోక ప్రభువు అకస్మాత్తుగా తీర్పు తీరుస్తాడు. కనుక యూదులు ఆ తీర్పునకు సిద్ధం కావాలి. మెస్సీయా బోధలను అంగీకరించి రక్షణం పొందాలి. ఈలాంటి భావాలు గల సామెతను తరువాత ఓ పాతికేళ్ళకు సువిశేషకారుడు గ్రంథస్థం చేసినపుడు అతని శ్రోతలు యూదులుగాదు, క్రైస్తవులు. కనుక అతడు క్రీస్తు మొదట ఉద్దేశించిన అర్ధాన్ని