పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/208

ఈ పుట ఆమోదించబడ్డది

విసిగించకూడదు. దేవుని సహనానికి కూడ హద్దులుంటాయి. కనుక మన హృదయ వృక్షం విూద ఎప్పటికప్పుడు పశ్చాత్తాపం అనే పండ్లు ఫలిస్తూండాలి, హృదయ పరివర్తనం లేనివాళ్ళకు గతులు లేవు.

9. మూసిన ద్వారం - లూకా 12,24-30

1. వివరణం

ఓ గృహస్థ విందు చేసి అతిథులను ఆహ్వానించాడు. కాని కొందరు సకాలంలో విందుకు వెళ్ళలేదు. సోమరితనం వల్ల ఆలస్యంగా వెళ్ళారు. వాళ్లు వెళ్ళేప్పటికే యజమానుడు తలుపు మూయించాడు. ఆలస్యంగా వచ్చినవాళ్ళు ఎంత మొత్తుకొన్నా అతడు తలుపు తీయలేదు. అబ్రాహము మొదలైన పుణ్యపురుషులూ, అన్యజాతివాళ్ళూ కూడి అక్కడ హాయిగా విందారగిస్తున్నారు. వాళ్ళను చూచి ఈ యాలస్యంగా వచ్చినవాళ్లు చిన్నపోయారు. ఐనా ఏమి లాభం? యజమానుడు వాళ్ళను వీధిలోకి గెంటించాడు.

2. భావం

యూదులు స్వర్గాన్ని లేక దైవరాజ్యాన్ని విందుగా భావించేవాళ్లు అని చెప్పాం. క్రీస్తు ఎంతగా బతిమాలినా యూదులు అతని బోధలను ఆలించడం లేదు. దైవరాజ్యంలో చేరడం లేదు. కనుక పరలోకపు తండ్రి వాళ్ళను తన రాజ్యం నుండి గెంటివేస్తాడు. ఆ దుర్ధశ రాకముందే, ఇప్పడు వాళ్లు ప్రభువు బోధలను ఆలిస్తే బ్రతికిపోతారు. కనుక క్రీస్తునీ అతని బోధలనూ అంగీకరించడంలో జాప్యం తగదని ఈ సామెత భావం.

3. అన్వయం

మనం తరచుగా ఇద్దరు యజమానులను సేవిస్తూంటాం. వాళ్ళ సృష్టికర్తా, సృష్టివస్తువులునూ, సృష్టివస్తు వ్యామోహంలో పడి సృష్టికర్తను అంగీకరించడంలో జాప్యం చేస్తూంటాం. భక్తుడైనవాడు ఏకైక దృష్టితో ఒకే యజమానుణ్ణి, అనగా దేవుణ్ణి మాత్రమే సేవించాలి — మత్త 6,24

10. చిన్నపిల్లల విమర్శలు - మత్త 11,16-19

1. వివరణం

స్నాపక యోహాను కరోర నియమాలతో జీవిస్తున్నాడు. కాని యూదులు అతని జీవిత విధానాన్ని మెచ్చుకోలేదు. అతనికి దయ్యం పట్టిందని హేళన చేసారు. క్రీస్తు విందుల్లో వినోదాల్లో పాల్గొంటున్నాడు. కాని అతని ఉల్లాస జీవితం కూడ యూదులకు నచ్చలేదు. అతడు తిండిపోతు అని నిందించారు. కనుక యూదులకు కఠిన జీవితమూ