పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. వివరణం '

ఓ ధనవంతుడు ఉండేవాడు. అతనికి బాగా పంటలు పండాయి. ధాన్యమంతా ఇల్లు చేరుకుంది. దాన్ని చూచి అతడు పొంగిపోయాడు. విస్తారమైన ఆ ధాన్యాన్ని నిల్వచేయడానికై క్రొత్త గిడ్డంగులు కట్టిద్దామనుకొన్నాడు. కొన్నియేండ్లపాటు తన కబ్బిన సిరిసంపదలను అనుభవిసూ, తిని త్రాగి తందనాలాడుతూ హాయిగా కాలక్షేపం చేయవచ్చుగదా అనుకొన్నాడు. కాని భగవంతుడు ఆ రాత్రే అతనికి కలలో ప్రత్యక్షమై "ఓరీ అవివేకీ! నీకిక నూకలు చెల్లాయి. నేను నీకిచ్చిన ప్రాణాన్ని ఈ రాత్రే మళ్ళా తీసికొని పోతాను" అన్నాడు. అలా ఆ ధనవంతుడు గతించాడు. అతని సొత్తు ఇతరుల పాలైంది.

ఈ సామెతలోని ధనికుణ్ణి దేవుడు “అవివేకి" అని సంబోధించాడు. బైబుల్లో అవివేకి లేక బుద్ధిహీనుడు అంటే దేవుడున్నాడని నమ్మినా అతన్ని లెక్కచేయకుండా జీవించే వాడు. దేవుడు లేడో అన్నట్లు అతన్ని పట్టించుకోకుండా సుఖభోగాలతో కాలక్షేపం చేసేవాడు. ఇక్కడ ఈ ధనికుడు ధాన్యమూ గిడ్డంగులూ సుఖభోగాలూ వీటితోనే సతమతమౌతున్నాడు. దేవుణ్ణి పట్టించుకోవడంలేదు. ఈలాంటి వాళ్ళను భగవంతుడు కరుణించడు.

3. భావం

నరులు ధనవ్యామోహంలో చిక్కిపోగూడదు. కూడూ గుడ్డా ఇలూ వాకిలి ప్రధానంగాదు. దైవరాజ్యానికి సిద్ధం కావాలి. తండ్రినీ ఆ తండ్రి పంపిన క్రీస్తునీ నమ్మి దైవరాజ్యంలో చేరాలి. లేకపోతే తలవని తలంపుగా ఆశాభంగానికి గురౌతాం.

4. అన్వయం

కీర్తన 14,1"బుద్ధిహీనులు దేవుడు లేడులే అని తలుస్తుంటారు" అని చెప్తుంది. ఇక్కడ బుద్ధిహీనులంటే నాస్తికులు కాదు. దేవుడు ఉన్నాడని నమ్మినా అతన్ని పట్టించుకోకుండా జీవించేవాళ్లు, దేవుడు లేడో అన్నట్లు లోకవ్యవహారాల్లోనే మునిగి తేలుతుండేవాళ్లు, ఇది ఓ రకమైన నాస్తికత్వం. ఈ దృష్టితో జూస్తే మనమందరమూ కొద్దిగానో గొప్పగానో నాస్తికులమే ఔతాం. పై ధనికుబ్లాగ దేవుణ్ణి పట్టించుకోకుండా కేవలం కూడూ గుడ్డా మొదలైన లోకవ్యవహారాల్లోనే ముగినిపోవడం భావ్యంకాదు.

6. ధనికుడూ, లాజరూ = లూకా 16, 19-31

1. సందర్భం

క్రీస్తు ధనంమీద మనసు పెట్టుకోవద్దని బోధిస్తూంటే ధనాసక్తిపరులైన పరిసయులు అతన్ని ఎగతాళి చేసారు. 16, 14 ఆ పరిసయులను ఉద్దేశించి క్రీస్తు ఈ సామెత చెప్పాడు.