పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యతిధి వివాహవస్త్రం లేకుండా వచ్చాడంటే అర్థం ఏమిటి? మెస్సియా యూద నాయకులకు తన రక్షణాన్ని ఈయగోరుతున్నాడు. వాళ్లు పశ్చాత్తాపపడాలి. ఆ రక్షణాన్ని అంగీకరించాలి. అప్పుడు దైవరాజ్యంలో చేరతారు. ఐనా యూదనాయకులు అహంకారంతో క్రీస్తు రక్షణాన్నినిరాకరించారు. ఇక్కడ ఈ మురికి బట్టతో వచ్చినవాడు క్రీస్తుని నిరాకరించే ఆ నాయకులకు చిహ్నం. ఆ నాయకులు ప్రభువుని నిరాకరించారు కనుక ప్రభువుకూడ వారిని నిరాకరిస్తాడు. వారికి మెస్సియా రాజ్యంలో స్థానంలేదు. మొదట క్రీస్తు ఈ సామెతను చెప్పినప్పడు అతడు ఉద్దేశించిన భావం ఇది.

కాని క్రీస్తు బోధలను ఎత్తి సువిశేషంగా వ్రాసినపుడు మత్తయి ఉద్దేశించిన భావం దీనికి కొంచెం భిన్నంగా ఉంటుంది, యూదులకు మారుగా క్రైస్తవులు దైవరాజ్యంలో చేరతారు అనే భావాన్ని మీదటి సామెతలో చెప్పాం. ఈ క్రైస్తవుల్లో రకరకాల ప్రజలున్నారు. సేవకులు వెళ్ళి మంచివారినీ చెడ్డవారినీ గూడపెండ్లి విందునకు ప్రోగుజేసికొని వచ్చారు - మత్త22,10. అనగా జ్ఞానస్నానం పొంది క్రైస్తవ సమాజంలో చేరినవారిలో మంచివాళూ ఉన్నారు. చెడ్డవాళ్ళూ వున్నారు. ఈ చెడ్డవాళ్ల క్రైస్తవ సమాజంలో చేరినంత మాత్రాన్నే సరిపోతుందా? వాళ్ళకు నైతిక బాధ్యతలు ఏమీ ఉండవా? కేవలం క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన్నేవాళ్లు రక్షణం పొందుతారా? ఈలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం కోసమే ఈ ప్రస్తుత సామెత ప్రచారంలోకి వచ్చింది. ప్రజలు జ్ఞానస్నానం పొంది క్రైస్తవ సమాజంలో చేరినంత మాత్రాన్నే చాలదు. వాళ్లు శుభ్రమైన రక్షణ వస్తాన్ని ధరించాలి. నీతి మార్గంలో నడవాలి. తమ పాపాలకు పశ్చాత్తాపపడాలి. కట్టడలను పాటించాలి. అప్పడే వాళ్లు దైవరాజ్యంలో చేరేది. ఇది ఈ సామెత భావం. ఈలా క్రీస్తు మొదట యూదులకు చెప్పిన సామెతను మత్తయి తర్వాత క్రైస్తవ సమాజానికి అన్వయించేలా చేసాడు. ఈలాంటి మార్పులు చాల సామెతల్లో కన్పిస్తాయి.

4. అన్వయం

తొలి శతాబ్దంలో జీవించిన యూదుల రబ్బయి ఎలియసేరు అనే అతని "మీరు చనిపోయే దినానికి ముందటి రోజుననే పశ్చాత్తాపపడుతుండాలి" అని శిష్యులకు బోధించాడు. శిష్యులు "అయ్యా! మేము ఏ దినం చనిపోతామో ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ఆ రబ్బయి “మనం రేపే చనిపోవచ్చు. కనుక ఈనాడే పశ్చాత్తాప పడాలి. ఈ విధంగా నరుడు జీవితంలో ప్రతిరోజూ మరుసటి రోజే తన మరణదినమేమో ననుకొని పశ్చాత్తాపపడుతూండాలి" అని జవాబు చెప్పాడు. క్రైస్తవ భక్తుడు రోజూ తన పాపాలు తలంచుకొని పశ్చాత్తాపపడుతూండాలి. రోజూ శుభ్రమైన రక్షణవస్తాన్ని ధరిస్తూండాలి. అనుదినమూ నీతివర్తనుడుగా మెలుగుతుండాలి. అప్పడే కాని అతడు మెస్సీయా సిద్ధం చేసిన విందు భుజించడానికీ, దైవరాజ్యంలో ప్రవేశించడానికీ అరుడు కాడు.