పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/196

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. వివరణం

ఓ గృహస్తు విందుచేసి మిత్రులను ఆహ్వానించాడు. కాని ఆ స్నేహితులంతా రకరకాల సాకులు చెప్పి విందుకు రావడం మానేసారు. రెండవ అతని చెప్పిన సాకు, తాను ఐదు జతల ఎడ్లకొని వాటిని పరీక్షింపబోతున్నానని. ఆ రోజుల్లో ఒక జత యెడు తొమ్మిది హెక్టార్ల భూమిని సేద్యం చేసేవి. కనుక ఈ భూస్వామి 45 హెక్టార్ల పొలంగల సంపన్నుడైన రైతు అనుకోవాలి. మూడవ అతని సాకు తాను అప్పడే పెండ్లి చేసికొన్నానని, యూదులు పురుషులను మాత్రమే విందుకు ఆహ్వానించేవాళ్లు, కనుక ఇతడు తాను నూత్నంగా పెండ్లి యాడిన వధువును ఒంటరిగా విడిచివచ్చుటకు అంగీకరించలేదు అనుకోవాలి.

ఈలా మిత్రులంతా సాకులు చెప్పి తప్పకోగా యజమానుడు కోపించి బిచ్చగాళ్ళను విందుకు ఆహ్వానించమన్నాడు. అతనికి బిచ్చగాళ్ళమీద ప్రత్యేకమైన అభిమానమేమో ఉండి కాదు. మిత్రులమీద కోపం వలన వాళ్ళను పిలిపించాడు- అంతే. కాని భోజనశాలలో ఇంకా తావుంది. శాల క్రిక్కిరిసినట్లుగా నిండిపోతే అతనికి ఎంతో గౌరవం. కనుక ఆ ఖాళీలను నింపడానికై అతడు మరలా రెండవసారి సేవకుని పంపాడు. ఆ సేవకుడు వెళ్ళి ఈసారి ఇలూ వాకిలీ లేని బికారులందరినీ పిల్చుకొని వచ్చాడు. ఈలా బిచ్చగాళ్ళూ బికారులూ ప్రోగై ఆ ధనికుని విందు భుజించి పోయారు. మిత్రులు మాత్రం అతని యింటికి భోజనానికి రానేలేదు. ఇక్కడ "పిలువబడిన వాళ్ళెవరూ నా విందును రుచి చూడరు" అనే 24వ వచనాన్ని విందు నడిపే గృహస్టే పలికాడో క్రీస్తే పలికాడో నిర్ణయించడం కష్టం. ఈ వాక్యాన్ని గృహస్టే పలికినట్లయితే మిత్రులెవ్వరూ తన విందు భుజింపజాలరని భావం. క్రీస్తే పలికినట్లయితే, యూద నాయకులెవ్వరూ మెస్సియా దైవ రాజ్యంలో ప్రవేశింపరని అర్థం చేసికోవాలి. యూదుల భాషలో విందు దైవ రాజ్యాన్ని సూచిస్తుంది.

మత్తయి 22, 1-10లో కూడ ఈ సామెత కన్పిస్తుంది. కాని అక్కడ మత్తయి కొన్ని మార్పులు చేసాడు. ఇక్కడి గృహస్టు అక్కడి రాజు. ఇక్కడలేని యుద్ధప్రస్తావనం అక్కడ వస్తుంది. ఈ రెండింటిలోను లూకా సామెతే క్రీస్తు మొదట చెప్పిన సామెతకు దగ్గరగా ఉండి ಹಿಂಬಂದಿ.

3. భావం

ఈ సామెత అర్థం ఏమిటి? క్రీస్తు మొదట యూదులకు ఈ సామెత చెప్పినప్పుడు దాని భావం ఇది. ప్రభువు పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు మొదలైన యూదనాయకులను మెస్సియా రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. కాని వాళ్లు అంగీకరించడంలేదు. కనుక సుంకరులు పాపులు మొదలైన పేదసాదలు దైవరాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది దీని మొదటి భావం.