పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/159

ఈ పుట ఆమోదించబడ్డది

2. వివరణం

ఓ కాపరి వున్నాడు. అతనికి నూరు గొర్రెలుండేవి. క్రీస్తునాడు పాలస్తీనా దేశంలో మూడు వందల గొర్రెలు పెద్ద మందగా భావింపబడేవి. ఈ సామెతలోని కాపరికి నూరు గొర్రెలు ఉన్నాయంటే, అది ఓపాటి మంద అనుకోవాలి. అతడు గొర్రెలను పొలంలో మేపుకొంటూ హఠాత్తుగా ఓ గొర్రె జారిపోయిందని గుర్తించాడు. పాలస్తీనా కాపరులు సాయంకాలం గొర్రెలను దొడ్డిలోనికి చేర్చేపుడుగాని వాటిని లెక్కవేయరు. ఐనా ఇతడు మితంమీరిన జాగరూకత కలవాడు కావడంచే గాబోలు గొర్రె తప్పిపోయిందని వెంటనే గుర్తించాడు. ఈలా గొర్రె తప్పిపోవడంలో వింతేమీలేదు. ఆ దేశంలో ఎగుడుదిగుళ్ళూ ముళ్ళపొదలూ, కట్టలూ, చుటూ గడ్డీగాదం పెరిగి గుర్తించడానికి వీలుగాకుండా వుండే గోతులూ మిక్కుటంగా వుంటాయి. గొర్రె ఈలాంటి గోతుల్లో జారిపడవచ్చు. లేదా ముళ్ళపొదల్లో చిక్కుకొని బయటికి రాలేకపోవచ్చు.

కాపరి గొర్రె తప్పిపోయిందని గుర్తించగానే మిగిలిన తొంబైతొమ్మిదింటిని తోడికాపరులకు ఒప్పజెప్పి ఆ వొక్కదాన్నీ వెదకడానికి ఆతురతతో వెళ్ళాడు. ఆతురత దేనికంటే, చీకటి పడితే నక్కలూ తోడేళ్ళూ మొదలైన వన్యమృగాలు గొర్రెను మింగి వేస్తాయి. అది ఒకవేళ ఎక్కడైనా జారిపడిపోయిందంటే పట్టపగలే రాబందులూ గ్రద్దలూ దాన్ని చీల్చివేస్తాయి. కావున కాపరి గొర్రె కోసం దీక్షతో వెదకాడు. సాయంకాల మయ్యేటప్పటికల్లా ఎక్కడో వోతావులో అది కంటబడింది. గొర్రెను జూడగానే అతడు కోపగించుకోలేదు. కూలివాడైతే నా కెంత శ్రమ గలిగించావని దానిని కర్రతో చావమోదేవాడే కాని సొంత కాపరి అలా చేయడు. పైపెచ్చు గొర్రె దొరికిందిగదా అని ఎంతో ఆనందించాడు. ఈ యానందం అనేది ప్రస్తుత సామెతలో ముఖ్యపదం.

అది యెదిగిన గొర్రే, ఐనా కాపరి దాన్ని ఓ చిన్నపిల్లలా భావించి మితిమీరిన జాలితో యెత్తి భుజాలమీద పెట్టుకొన్నాడు. దాని నాలుకాళ్ళూ జోడించి యెడమచేతితో బట్టుకొని కుడిచేతితో కర్ర ఊతవేసికొంటూ చరచరా తిరిగి వచ్చాడు. ఆనందంతో ఇల్లజేరి తన స్నేహితులైన తోడి కాపరులను బిలిచి తప్పిపోయినగొర్రె దొరికిందని చెప్పాడు. వాళూ అతనితోపాటు సంతోషించారు. సురక్షితంగా వున్న తొంబై తొమ్మిది గొర్రెల వలన గలిగే సంతోషంకంటె తప్పిపోయి మళ్ళా దొరికిన ఈ వొక్క గొర్రెవలన గలిగిన సంతోషం గొప్పది. ఆ రీతినే మోక్షంలోని దేవుడు కూడ పరివర్తనంతో అవసరంలేని తొంబైతొమ్మిదిమంది నీతిమంతుల కంటె, పరివర్తనం చెందిన ఒక్క పాపినిజూచి ఎక్కువ ఆనందం పొందుతాడు. కనుక పాపాత్ములనబడే వాళ్ళను చిన్నచూపు జూడగూడదని క్రీస్తు భావం, పరలోకంలోని తండ్రిలాగే యూదనాయకులుగూడ వాళ్ళను కరుణతో ఆదరించాలని అతని ఉద్దేశం.