పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

10,3. అతనికి తన గొర్రెలు (భక్తులు) తెలుసు. ఆ గొర్రెలకు అతడు తెలుసు -10, 14-15.యేసుకు మనం తప్పకుండా తెలుసు. కాని అతడు మనకు తెలుసా? ఎంత వరకు తెలుసు? మనకు అతనిపట్లవున్న ప్రేమభావ మెంత? మగ్డలీనలాగ మనంకూడ ఆ ప్రభువుపట్ల అపార భక్తినీ ప్రేమనూ పెంపొందించుకొనే భాగ్యం కొరకు వేడుకొందాం.

శిష్యులు క్రీస్తుకి సహోదరులు. దేవుడు అతనితండ్రి, వారి తండ్రికూడ -20,17. ఉత్థాన క్రీస్తుద్వారా శిష్యులు దేవునికి ప్రీతి కలిగించే బిడ్డలౌతారు. ఆత్మవారి దైవపత్రత్వాన్ని బలపరుస్తుంది. ఆ శిష్యుల్లాగా నేడు మనం కూడ క్రీస్తుకి సోదరులం, దేవునికి బిడ్డలం. ఈ భాగ్యానికి మనమెంతో సంతసించాలి.

3. శిష్యులకు దర్శనం 20, 19-23

ఈ భాగంలో నాలుఅంశాలున్నాయి. వీటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. శాంతి

శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసిన గదిలో వున్నారు. వారి భయాన్ని పోగొట్టడానికే క్రీస్తు వారికి దర్శనమిచ్చింది. అతడు వారితో మీకు శాంతి కలగాలి అన్నాడు. ఏమి శాంతి? ఇది అభయవాక్యం. ఈ శాంతి ప్రధానంగా క్రీస్తు తన మరణంద్వారా సాధించిన పాపపరిహారమే. ఇంకా యీ శాంతి ఆత్మ ప్రదానాన్నీ ఆ యాత్మద్వారా ఉత్తాన క్రీస్తు శిష్యులతో నెలకొని వుండడాన్నీకూడ సూచిస్తుంది. ప్రభువు శిష్యులకు తన చేతులనూ ప్రక్కనూ చూపించాడు. ఎందుకు? ఆ శరీర భాగాల్లో సిలువ గుర్తులున్నాయి. కనుక సిలువవేయబడిన క్రీస్తు, ఇప్పడు వుత్తానమై దర్శనమిస్తున్న క్రీస్తు ఒక్కడేననిభావం. శిష్యులు తమకు కన్పించే క్రీస్తుని సందేహింపనక్కరలేదని తాత్పర్యం.

2. శిష్యుల వేదబోధ

క్రీస్తు శిష్యులతో తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మలను పంపుతున్నాను అన్నాడు–21. ఇది గొప్ప వాక్యం. నాల్గవ సువిశేషంలో ప్రభువు శిష్యులను పంపడం అనే అంశం ఈ సందర్భంలో మాత్రమే వస్తుంది. తండ్రి క్రీస్తుని పంపడం, క్రీస్తు శిష్యులను పంపడానికి మాదిరి, ఆధారమూ కూడ. శిష్యులు క్రీస్తు రక్షజోద్యమాన్ని కొనసాగిస్తారు. ఆ వుద్యమంలో క్రీస్తు వారితో వుండి వారి కార్యాన్ని విజయవంతం చేస్తాడు. తండ్రి తనతో వుండి తన్ను బలపరచినట్లే, తానూ శిష్యులతో వుండి వారిని బలపరుస్తాడు.వాళ్ళ పనిని తన పనిగా భావిస్తాడు. క్రీస్తు లోకానికి తండ్రిని చూపించినట్లే ఇకమీదట శిష్యులు క్రీస్తుని చూపిస్తారు.