పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/94

ఈ పుట ఆమోదించబడ్డది

ఏమీ అడుగుకోం. దేవుణ్ణి మాత్రమే స్మరిస్తాం. ఉత్తమప్రేమ చేయవలసింది ఇదే. క్రీస్తు తన సిలువ మరణంలోనే దేవునికి ఈ మూడు విన్నపాలు విన్నవించాడు. తండ్రి వాటిని అంగీకరించాడు గూడ. కాని లోకాంతందాక గూడ ఇవి పూర్తిగా నెరవేరవు. కనుక నేడు మనంకూడ మన ప్రార్థనలో వీటిని కొనసాగించాలి. వీటిద్వారా నేడు మన విశ్వాసమూ, నిరీక్షణా, ప్రేమా పెరుగుతాయి.

చివరి నాలు విన్నపాల్లో మన కొరకు కరుణగల దేవుణ్ణి వేడుకొంటాం. మన ఆహారం కొరకూ, పాప పరిహారం కొరకూ, శోధనం నుండి విముక్తి కొరకూ, పిశాచంనుండి రక్షణం కొరకూ అతన్ని వేడుకొంటాం. ఇవి మన అక్కరలు. ఇక, ఈ యేడు విన్నపాలను కొంచెం విపులంగా పరిశీలిద్దాం.

1. నీ నామం పవిత్రపరచబడునుగాక

ఇక్కడ "పవిత్రపరచబడునుగాక" అంటే పవిత్రంగా గణింపబడునుగాక అని అర్థం. అనగా దేవుని దివ్యనామం పవిత్రంగా ఎంచబడాలని కోరుకుంటున్నామన్నమాట. ఈ విన్నపంలో దేవుడు క్రీస్తు ద్వారా చేసిన రక్షణ ప్రణాళికను స్మరించుకొంటున్నాం. ఆయన యెదుట మనం నిర్దోషులంగాను పవిత్రంగాను మెలగాలని కోరుకుంటున్నాం - ఎఫే 1,4.

దేవుడు తనంతట తాను పరమ పవిత్రుడు. ఈ పవిత్రతనే బైబులు "మహిమ" అని కూడ పిలుస్తుంది. దేవుడు తన మహిమను నరులకు కూడ యిచ్చాడు - కీర్త 8,5. ఐతే పాపంవల్ల మనం ఈ మహిమను కోల్పోయాం. కాని ప్రభువు తన దివ్యనామం ద్వారా తన మహిమను వెల్లడిచేసి మనం కోల్పోయిన దైవ మహిమను తిరిగి పొందేలా చేస్తాడు.

అతడు అబ్రాహాముకి కూడ తెలుపని తన దివ్యనామాన్ని మొట్టమొదట మోషేకు వెల్లడిచేసాడు. నేను ఉన్నవాడను అని అతనితో చెప్పాడు - నిర్గ 3,14. అనగా తాను యిస్రాయేలీయులకు సహాయంచేసే దేవుడని అర్థం. పవిత్రుడైన దేవుని ప్రజ కనుక యిప్రాయేలు కూడ పవిత్రంగా జీవించాలని ఆజ్ఞాపించాడు. కాని ఆ ప్రజలు మాటిమాటికి దేవునినుండి వైదొలగారు. అతని దివ్యనామాన్ని జాతుల మధ్య అమంగళ పరచారు - యెహె 20,9. కాని పూర్వవేదంలోని భక్తులూ ప్రవక్తలూ శేషజనమూ దివ్యనామ మహిమ కొరకు తపించిపోయారు.

కడన తండ్రినామాన్ని మనకు పరిపూర్ణంగా తెలియజేసినవాడు క్రీస్తు - యోహా 17,8. అతడు విశేషంగా సిలువ మరణం ద్వారా తండ్రి నామాన్ని మనకు తెలియజేసాడు.