పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/45

ఈ పుట ఆమోదించబడ్డది

ఇక, మనం ప్రార్ధనం జేసికొనే తావు - అది యేదైనా - శుభ్రంగా వుండాలి. మన దేవాలయాన్నీ బలిపీఠాన్నీగూడ శుభ్రంగా వుంచుకోవాలి.

4. కాలం వెచ్చించడం

చాలమంది బోలెడన్ని పనులతో సతమతమౌతూంటారు. భక్తిగా జీవించగోరే వాళ్ళకూడ ప్రార్థనకు వ్యవధిలేదంటూంటారు. కనుక ఎక్కువ కాలం ప్రార్థనకు వినియోగించరు. కాని ప్రార్థనమీద కాలం వెచ్చించందే దేవుడు అనుభవానికి రాడు.

నిత్యజీవితంలో మిత్రులూ, భార్యాభర్తలూ, తల్లిదండ్రులూ బిడ్డలూ మొదలైనవాళ్ళ ఒకరితో వొకరు ఎంతో కాలం గడుపుతారు. దీనివల్ల వాళ్ళకు సఖ్యసంబంధాలు పెరుగుతాయి. ఒకరితో ఒకరు ఐక్యమౌతారు. ఇదే సూత్రం దేవుడికి గూడ వర్తిస్తుంది. మనం దేవుని సన్నిధిలో గూడ గంటల కొలది కాలం గడపాలి. దీర్ఘ కాలం ప్రార్ధన చేయాలి. అప్పుడే ఆ ప్రభువుతో మనకు సఖ్యసంబంధాలు పెరిగేది. అప్పడే అతడు మనకు అనుభవానికి వచ్చేది. ప్రార్థనమీద కాలం వెచ్చించడానికి ఇష్టపడనివాడికి దేవుడు చచ్చినా అనుభవానికి రాడు.

వ్యవసాయం మొదలైన వృత్తుల్లో, టెన్నిస్ మొదలైన క్రీడల్లో ఆరితేరాలనుకొనేవాళ్ళ ఆ కార్యాలకు ఎంతో కాలం వినియోగిస్తారు. ఎడతెగని కృషిచేస్తారు. అప్పడే వాళ్ళకు ఫలితం దక్కేది. అరకొరలుగా పనిచేసే రైతుకి పొలం పండుతుందా? కొద్దికాలం మాత్రమే అభ్యాసంజేసే ఆటగాడు ప్రవీణుడు ఔతాడా? మరి మనం కొద్దికాలం మాత్రమే ప్రార్థనజేస్తే దేవుడేలా అనుభవానికి వస్తాడు?

కొంతమంది ప్రార్ధనమీద కాలం గడపడం దండుగ అనుకొంటారు. ఆ కాలంలో ఏదైనా పనిజేసికొంటే ఎక్కువ ఫలితం కలుగుతుందనుకొంటారు. ఇది పొరపాటు. ప్రార్థనకు నియోగించిన కాలం వ్యర్ధమైపోదు. అమూల్యమౌతుంది. దేవుని యెదుట గడిపిన కాలంతో దేవుణ్ణి కొనుక్కొంటాం. ఇంతకంటె మహాభాగ్యం ఏముంటుంది?

పునీతులు దేవునికి ప్రార్థన చేసేపుడు దేవుని ప్రజలకు సేవలు చేయాలని తపించిపోయారు. దేవుని ప్రజలకు సేవలు చేసేపుడు దేవునికి ప్రార్ధన చేయాలని ఉవ్విళూరారు. వాళ్ళ ప్రార్థనకూ సేవాకార్యాలకూ సమానమైన విలువనిచ్చారు. నేడు మనం సేవాకార్యాలకు ఎక్కువ కాలం వెచ్చించి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది తప్ప, ఎప్పడుగూడ మన భక్తికి కొలతబద్ద మనం ప్రార్ధనంమీద ఎంత కాలం వినియోగిస్తున్నామన్నదే.