పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

తెలియదా?" - 42-4 ఈ వేదవాక్యాలు నిరసించేది హద్దు మీరిన భోగవాంఛనీ, ధనవాంఛనీ. కనుక మనం ఈ వాంఛలతో ప్రార్ధనచేస్తే దేవుడు ఆలించడు. క్రీస్తు భోగభాగ్యాలకు దూరంగా వున్నాడు. అతడు మనం అనుదినాహారం కొరకు ప్రార్ధన చేయాలన్నాడు. తండ్రిమీద ఆధారపడి సరళజీవితం గడపాలన్నాడు. విపరీతమైన ధనవాంఛ అతని మనసుకి వ్యతిరేకమైంది. కనుక మనం ఆక్రమమైన ధనార్థన కొరకూ భోగాల కొరకూ ప్రార్ధనచేస్తే ప్రభువు విన్పించుకోడు. అతడు మనం మొదట దైవరాజ్యాన్ని వెదకాలని బోధించాడుకదా? - మత్త 6, 33.

4. పేదలకు ఉదారంగా ఈయాలి

దేవుడు మన ప్రార్థనను ఆలించాలంటే మనం పేదసాదలకు ఉదారంగా దానం చేయాలి. మనం తోడివారికిస్తే దేవుడు మనకిస్తాడు. ఈ సందర్భంలో ప్రభువు ఈలా ఆదేశించాడు. "మీరు పరులకు ఈయండి. దేవుడు మీకిస్తాడు. కుదించి, అదిమి, పార్లిపోయే నిండు కొలమానంతో ఇస్తాడు. మీరు ఏకొలతతో కొలుస్తారో దేవుడు మీకు అదే కొలతతో కొలుస్తాడు" - 6, 38. పేదసాదలూ అక్కరలోవున్నవాళ్ళూ మనలను అర్ధిస్తారు. అప్పడు మనకున్నంతమట్టుకు మనం ఉదారంగా ఈయాలి, మనం ఇతరులకు ఇచ్చేదాన్నిబట్టి దేవుడు మనకిస్తాడు. ఇది పై వేదవాక్యాల భావం. కనుక మనం పేదసాదలను పట్టించుకోకుండా దేవుడు మన మనవిని ఆలించాలంటే కుదరదు.

5. క్రీస్తు పేరుమీదిగా అడగాలి

మనం క్రీస్తుపేరుమీదిగా తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రి మన మనవిని ఆలిస్తాడు. క్రీస్తు ఈలా బోధించాడు. "మీరు నా పేరిట తండ్రిని ఏమి యడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు - యోహా 16,28. "మీరు నా పేరిట నన్ను ఏమియడిగినా నేను చేసిపెడతాను" -14,14. తిరుసభ ప్రార్థనలన్నీ"మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని చేస్తున్నాం" అనే మాటలతో ముగుస్తాయి. దీనికి కారణం పై వేదవాక్యాలే. కనుక మనం మన వ్యక్తిగత ప్రార్థనలో కూడ ఈ సూత్రాన్ని పాటించాలి.

కాని ఇక్కడ "క్రీస్తుపేరుమీదిగా" అడగడమంటే భావం ఏమిటి? క్రీస్తు సిలువమరణంచెంది తండ్రికి ప్రీతి కలిగించాడు. క్రీస్తు మనతరపున తండ్రికి ప్రార్ధన చేస్తాడు. కుమారునిపట్ల గల ప్రీతిచే అతని పేరుమీదిగా మనం ఏమడిగినా తండ్రి చేసిపెడతాడు. కనుక క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా మనం తండ్రికి ప్రార్ధనం చేయాలి