పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/39

ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతోవిలువైన వస్తువునైనా వొదలుకొంటారుగాని పగను వదలుకోడానికి ఇష్టపడరు. ఇతరులమీద కోపతాపాలు వెళ్ళగ్రక్కుతూంటే, వీలైనపుడల్లా వాళ్ళకు కీడుచేస్తూంటే, మనకు ఎంతో సంతృప్తిగా వుంటుంది. కాని కరుణామయుడైన భగవంతునికి ఈ పద్ధతి నచ్చదు. కనుక అతడు మన ప్రార్థనను ఆలించడు.

మరి మనం ఏమి చేయాలి? మన శత్రువులను క్షమించడం నేర్చుకోవాలి. ఏలా? మనకు గిట్టనివాళ్ళ పేర్లను జాబితాగా వ్రాసికోవాలి. వారి కొరకు దేవుని ప్రార్థించాలి. ఈ ప్రార్ధనవల్ల మనకు శత్రువులపట్లగల అనిష్టభావాలు క్రమేణ తొలగిపోతాయి. ప్రార్ధన హృదయాన్ని పవిత్రంచేసి ద్వేషాన్ని పటాపంచలు చేస్తుంది.

శత్రువుని క్షమించడం చేతగానితనం అనుకోగూడదు. పగతీర్చుకోవడం పురుషలక్షణమనే దురభిమానానికి పోగూడదు. శత్రువుని క్షమించడం దైవగుణం, కనుక విరోధిని మన్నించడంద్వారా మనం దేవుడంతటివాళ్ళమౌతాం.

ఇంత చెప్పినా శత్రువుని మన్నించడం కష్టంగానే వుంటుంది. నరుల మనసులు భిన్నభిన్నంగా వుంటాయి, కొందరైతే పగవాణ్ణి ఎంతమాత్రం మన్నించలేరు. ఆలాంటప్పుడు ఈ క్రింది మూడు సూత్రాలు ఉపయోగపడతాయి.

1. ముందే చెప్పినట్లు మన శత్రువుల కొరకు ప్రార్ధనచేయాలి. ఈ కార్యాన్ని క్రీస్తు ఆజ్ఞాపించాడు. అతడు “మీ శత్రువులను ప్రేమించండి. మిమ్ము హింసించేవారి కొరకు ప్రార్థించండి" అన్నాడు - మత్త 5, 44. మనం ప్రార్ధన చేసేవాళ్ళమీద మనకు సానుభూతి కలుగుతుంది. క్రమేణ వాళ్ళ తప్పులను క్షమించగలుగుతాం.

2. నాకు జరిగిన ఈ యపకారాన్ని దేవుడు అనుమతించాడు, అతడే దాన్ని నిర్ణయించాడు అనుకోవాలి. దేవుడు అనుమతించందే, అతడు నిర్ణయించందే, ఎవడూ మనలను బాధించలేడు. కనుక మనం ఇతరులు మనకు కలిగించే కష్టాల్లో అదృశ్యంగావున్న దేవుని హస్తాన్ని గుర్తించాలి. క్రీస్తు ఉత్దానానంతరం పేత్రు యెరూషలేములో ప్రసంగిస్తూ తండ్రి చిత్తప్రకారం, అతని భవిష్యత్ జ్ఞానం ప్రకారం, యేసు సిలువ మరణానికి అప్పగింపబడ్డాడు" అన్నాడు - అ,చ. 2,23. తండ్రి చిత్తంలేందే, అతనికి తెలియకుండా యూదులు, క్రీస్తుని సిలువమీద కొట్టి చంపి వుండరుకదా? మన బాధలకుగూడ ఇదే సూత్రం వర్తిస్తుంది, దేవుడు నిర్ణయించందే ఎవడూ మనలను బాధించలేడు. ఈ జీవితంలో మన హేరోదులూ పిలాతులూ మనకుంటారు. కాని మనం ఈ హేరోదులమీదా పిలాతులమీదా మనస్తాపపడుతూ కూర్చోకూడదు. వారిని నడిపించే దేవుణ్ణి గుర్తించాలి.