పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/207

ఈ పుట ఆమోదించబడ్డది

1. విత్తేవాని సామెత


మత్త 13,3-9, 19-23


ప్రభూ! నీవు శిష్యులకు ఉపమానాలతో బోధిస్తూ
విత్తేవాని సామెత చెప్పావు

నీవు మా హృదయాల్లో చల్లే విత్తనాలు
త్రోవ ప్రక్కన పడితే,
అనగా మేము నీ బోధనలను గ్రహించకపోతే,
పక్షిరూపమైన పిశాచం వచ్చి
మొలవకముందే వాటినెత్తుకొని పోతుంది

నీవు మా యెడదల్లో చల్లే విత్తనాలు
రాతినేల విూద బడితే
అవి మొలకెత్తుతాయిగాని వేరుబాతుకోలేవు,
అనగా మా హృదయాలు శ్రమలకు జంకితే
నీ బోధలు ఫలితాన్నీయవు

నీవు మా మనసుల్లో చల్లే విత్తనాలు
ముండ్ల పొదల్లో పడితే
మొలకెత్తి కొంచ మొదుగుతాయికాని
తర్వాత అవిసిపోతాయి,
అనగా మా ఐహిక చింతలూ ధనవ్యామోహాలూ
నీ బోధలనే మొక్కలను అణచివేస్తాయి
ఇంకా వుద్యోగాలు పదవులూ
మొదలైన ప్రలోభాలవల్ల కూడ
నీ సందేశాలనే పైరు అణగారిపోతుంది

నీవు మా అంతరంగంలో చల్లే విత్తనాలు
సారవంతమైన నేలమిూదబడితే,
అనగా మా హృదయాలు నీ బోధల నంగీకరిస్తే
అవి నూరంతలు పంట పండుతాయి