పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/169

ఈ పుట ఆమోదించబడ్డది

31. కోతగాండ్రను పంపమని తండ్రికి మనవి - మత్త 9, 37-39

రైతు పంటను సేకరించినట్లుగా దేవుడు ప్రజలను దైవరాజ్యంలోనికి సేకరిస్తాడు. పంట యజమానుడు తండ్రి. పంటను కోసే కోతగాడు క్రీస్తే, కాని అతడొక్కడే పంటనంతటిని కోయలేడు. కనుకనే అతడు శిష్యులను ప్రోగుచేసుకొన్నాడు. ఇప్పడు కూడ అతనికి క్రొత్త శిష్యులు కావాలి. యువతీయువకులు పిలుపును అందుకోవాలి. వీళ్లే పనివాళ్లు లేక కోతగాండ్రు. ఎక్కువ మంది కోతగాండ్రను పంపి, ఎక్కువ పంటను సేకరించమని మనం తండ్రిని వేడుకోవాలి. అనగా ఎక్కువ మంది దైవ పిలుపుని స్వీకరించాలని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్ధన వల్ల కొందరు యువతీయువకులు పిలుపుని అందుకుంటే మన జీవితం ధన్యమౌతుంది.

32. పరలోక జపం - మత్త 6.9 -13

పరలోక జపం క్రీస్తు స్వయంగా చేసింది. తానే మనకు నేర్చింది. కనుక ఇది జపరాజం. దీనికి మించిన జపం మరొకటి లేదు. దీనిలో మొత్తం 7 విన్నపాలు వున్నాయి. తొలి మూడు దేవుణ్ణిస్తుతిస్తాయి. మలినాలు మన అక్కరులను దేవునికి తెలియజేస్తాయి. ఈ జపంలో ముఖ్యాంశాలు రెండు. మొదటిది, దేవుణ్ణి తండ్రీ అని సంబోధిస్తాం.ఇక్కడ అరమాయిక్ భాషలో వాడినమాట "అబ్బ". ఈ పదానికి నాన్న అని అర్థం. క్రీస్తు నాడు యూదుల చిన్నపిల్లలు తమతండ్రిని ఈ నామంతో పిల్చేవాళ్లు అనగా మనం దేవుణ్ణి నాన్న అనిపిలుస్తున్నాం. అతనిపట్ల మనకు చనువు, పరిచయం ఉండాలని ఈ పదం సూచిస్తుంది. కొంతమంది దేవునిపట్ల చనువు పెంపొందించుకోవడానికి భయపడతారు. ఈ భయమేమి అక్కరలేదు. ఇక రెండవ అంశం, దేవుని చిత్తానికి లొంగడం. క్రీస్తు దేవుని చిత్తానికి లొంగినట్లే మనమూ ఆ ప్రభువు చిత్తానికి లొంగాలి. భక్తుడు అన్ని కార్యాల్లోను దేవుని చిత్తాన్ని తెలిసికొని ఆ చిత్త ప్రకారం జీవిస్తాడు.

33. బర్తిమయి మొర – మార్కు 10, 47-48

బర్తిమయి కండ్లులేని కబోది, ఆ ప్రభువు దగ్గరకు వెళ్ళి చూపు. పొందాలని ఆశించాడు. కాని పోయే అవకాశం లేక త్రోవ ప్రక్కన కూర్చుండి వున్నాడు. ఓ దినం క్రీస్తు దిడీలువ ఆదారిన వచ్చాడు. ఆ గ్రుడ్డివానికి మంచి అవకాశం లభించింది. అతడు అయ్యా! నన్ను కరుణించు అని అరచాడు. కాని చుట్టపట్ల వున్న జనం అతన్నికసురుకొని నోరు మూయింపజూచారు. ఆ గ్రుడ్డివాడు మాత్రం పట్టుదలతో అయ్యా! నన్నుకరుణించు అని ఇంకా బిగ్గరగా అరచాడు. అతని ప్రార్ధనలో విశ్వాసముంది. పట్టుదల వుంది.