పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది

25. విజ్ఞలకుగాక పసిబిడ్డలకు - మత్త 11, 25-27

ప్రభువు పరలోకం రహస్యాలను గర్వితులైన పరిసయలకూ, యూదమత పెద్దలకు తెలియజేయలేదు. పసిబిడ్డలకు తెలియజేసాడు. ఈ "పసిబిడ్డలు" దీనులు. క్రీస్తు శిష్యులంతా ఈ వర్గంవాళ్లే. దైవశ్రుతి వీరికి తెలిసినట్లుగా యూదమత నాయకులకు తెలియదు. తండ్రి తన్ను గూర్చిన సమస్త జ్ఞానాన్ని కుమారునికి అప్పగించాడు. కనుక మనకు తండ్రిని తెలియజేసేవాడు క్రీస్తే. వాళ్లిద్దరికి పరస్పర జ్ఞానం, ప్రేమ వుంటాయి. నేడు మనం క్రీస్తుద్వారా తండ్రినీ, తండ్రి ద్వారా క్రీస్తునీ తెలిసికొంటాం. కాని వినయమూ సరళస్వభావమూ కలవాళ్లే దేవుణ్ణి తెలిసికొనేది.

26. నేను నీ కొరకు ప్రార్థంచాను - లూకా 22, 31-32

ధాన్యాన్ని జల్లెడలో పోసి అటూఇటూ వూపుతారు. అప్పడు మట్టి పెళ్లలనూ, రాళ్లనూ వేరు చేయవచ్చు పిశాచం శిష్యులను గోదుమలనులాగ జల్లెడ పట్టగోరింది అనగా వారిని బలంగా శోధించగోరింది. శోధించిందికూడ. కనుక శిష్యులు క్రీస్తుపట్ల విశ్వాసాన్ని కోల్పోయి అతన్ని విడచి పారిపోయారు. కాని ప్రభువు పేత్రు కొరకు ముందుగానే ప్రార్థించాడు. క్రీస్తుని నిరాకరించిన పేత్రు ఆ ప్రార్థనా బలంవల్ల అతన్ని మళ్లా విశ్వసించాడు. పడిపోయి మళ్లా లేచాడు. అలా లేచాక అతడు తోడి శిష్యులను కూడ స్థిరపరచాడు. అనగా క్రీస్తునుండి పారిపోయిన శిష్యులను మళ్లా క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చాడు. ఈలా క్రీస్తు ప్రార్థన శిష్యులందరికీ మేలు చేసింది. నేడు ఉత్ధాన క్రీస్తు మన కొరకుగూడ ప్రార్ధన చేస్తుంటాడు - హెబ్రే 7,25. కనుకనే మనం ఎన్నో శోధనలనూ అపాయాలనూ తప్పించుకొంటూంటాం. మనకు దైవానుగ్రహం మీద నమ్మకముండాలి.

27. ఈ పాత్రను తొలగించు - మార్కు 14,36

క్రీస్తు గెత్సెమని ప్రార్ధనం ఎందరికో ప్రేరణం పుట్టించింది. ఈ జపంలో "పాత్ర" అంటే సిలువ మరణమే. క్రీస్తు సిలువ మరణాన్ని తొలగించమని తండ్రిని వేడుకొన్నాడు. చనిపోవడానికి ఏ ప్రాణి ఒప్పకోదు. కనుక క్రీస్తుకి కూడ తన మరణం అనిష్టమైంది. అందరు నరుల్లాగే అతడుకూడ దీర్ఘకాలం జీవించాలని కోరాడు. ఐతే అతడు ఎల్లవేళల తండ్రి చిత్తానికి బద్థుడు. కనుక తండ్రి కోరినట్లే తాను మరణానికి సంసిద్థుడయ్యాడు. తండ్రి కుమారుడు అడిగినా సిలువ మరణాన్ని తొలగించలేదు. దాన్ని భరించే శక్తిని మాత్రం ప్రసాదించాడు. నేడు మనం దేవుని చిత్తానికి లొంగం.మన చిత్త ప్రకారం పనులు జరగాలని కోరుకొంటాం. కాని ఇది పద్ధతి కాదు. దేవుడు నరునికి లొంగడు.