పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/142

ఈ పుట ఆమోదించబడ్డది

పొడువబడిన సేవకునివైపు దీనంగా చూచారు. యోహాను ఈ భావాలన్నిటినీ సిలువమీద వ్రేలాడే క్రీస్తుకి వర్తింపజేసాడు. పూర్వవేద ప్రజలు తాము పొడిచి చంపిన సేవకునివైపు కరుణతో జూచినట్లే నూత్నవేద ప్రజలు సిలువమీద పొడవబడిన క్రీస్తువైపు భక్తిభావంతో చూడాలి అన్నాడు.

క్రీస్తుకూడ తన బోధల్లో ఈ జెకర్యాభావాలను సూచించాడు. "మోషే యెడారిలో సర్పాన్ని ఎత్తినట్లే మనుష్యకుమారుడు కూడ ఎత్తబడతాడు" అన్నాడు - యోహా 8,14 ఇంకా "నేను భూమిమీదినుండి పైకెత్తబడినపుడు అందరినీ నా చెంతకు ఆకర్షిస్తాను" అన్నాడు – 12, 32. కనుక సిలువమీద పొడువబడిన సేవకుడు, క్రీస్తు, అందరినీ తన వైపుకి ఆకర్షించుకొంటాడు. భక్తిభావంతో, విశ్వాసంతో అతని వైపు చూచేవాళ్ళకు అతడు నిత్యజీవం దయచేస్తాడు.

యోహాను సిలువమీద వ్రేలాడే క్రీస్తుని సైనికుడు ఈటెతో పొడవడం కన్నులార చూచాడు. ఆ దృశ్యానికి అతని మనస్సు కరిగిపోయింది. కనుకనే ఆసంఘటనను నల్లరు సువిశేషకారుల్లోను అతడొక్కడే పేర్కొన్నాడు. దాన్ని గూర్చి నొక్కిచెప్పాడు. వేరే విషయాలను వర్ణించేపుడుగూడ యోహాను ఈ యంశాన్ని మర్చిపోలేదు. నాల్గవ సువిశేషంలో క్రీస్తు తోమాను ఆహ్వానించిన సందర్భంలో "నీచేయి చాచి నా ప్రక్కలో వంచు" అంటాడు - 20, 27. అనగా ఈ యంశం యోహాను హృదయం మీద చెరగని ముద్ర వేసిందని చెప్పాలి. ఈ యద్భుత సంఘటనం మనకు కూడ భక్తిని పుట్టించాలి.

2. క్రీస్తు ప్రక్కలోనుండి నెత్తురు స్రవించడం

సైనికుడు క్రీస్తు ప్రక్కను ఈటెతో పొడవగా నెత్తురు స్రవించింది. - యో 19,34 యోహాను తన సువిశేషం కాక తాను వ్రాసిన మొదటి జాబులోకూడ ఈ యంశాన్ని పేర్కొన్నాడు. "క్రీస్తు జలంతోను రక్తంతోను వచ్చాడు. అతడు కేవలం జలంతోనే రాలేదు, జలంతోను రక్తంతోను వచ్చాడు" 1యోహా 5,6.

మొదట క్రీస్తు ప్రక్కలోనుండి కారిన రకాన్ని గూర్చి విచారిద్దాం. ఈ నెత్తురు ప్రధానంగా బలిని సూచిస్తుంది. క్రీస్తు మనకు పాస్క గొర్రెపిల్ల వంటివాడని చెప్పాంగదా? సిలువమీద అతడు నెత్తురుచిందించి ప్రాణత్యాగం చేసికొన్నాడు. ఇదే అతని బలి, అతని ఆత్మార్పణం. దీని ద్వారా మనకు పాపవిమోచనం కలిగింది. నూత్నవేదం చాలాతావుల్లో ప్రభువు నెత్తురు మనకు పాపపరిహారం చేసిపెడుతుందని చెప్పంది, ప్రస్తుతానికి అలాంటి సందర్భాలను మూడింటిని మాత్రం పరిశీలిద్దాం.