పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/124

ఈ పుట ఆమోదించబడ్డది

శత్రువులను క్షమించడం కష్టమని చెప్పాం, విరోధుల మీద పగ తీర్చుకోకపోతే మన మగతనమేమంది అనుకొంటాం. పౌరుషాలు పలుకుతాం. శత్రుశేషం" మిగలనీయరాదని కూడ మనదేశంలో ప్రాచీనసూక్తి కాని విరోధిమీద పగతీర్చుకోవడమనేది ప్రాకృతికమానవుని లక్షణం. విరోధిని క్షమించడం ఆధ్యాత్మిక మానవుని లక్షణం, ప్రాకృతిక మానవులం గనుక మనంతట మనకు ఈ గుణం అలవడదు. కాని క్రీస్తు ఈ క్షమాగుణాన్ని ఓ వరంగా మనకు ప్రసాదించగలడు. కనుక క్రీస్తు క్షమాగుణాన్ని ఆదర్శంగాబెట్టుకొని మనంగూడ పగవారిని మన్నించాలి. ఇంకా, క్షమాగుణం శిష్యధర్మాల్లో ఒకటి. సువిశేష కథలో క్షమింపనొల్లని సేవకునికి ఏ గతి పట్టిందో మనకు తెలుసు. కనుక ఈ క్షమాగుణం లేందే మనం అచ్చమైన క్రీస్తు శిష్యులం కాలేమని గుర్తించాలి — మత్త 18,35.

రెండవ వాక్యం

"నేడే నీవు నాతోకూడ పరలోకంలో ప్రవేశిస్తావు" - లూకా 28, 48.

ప్రభువు సిలువపీఠమనే న్యాయసింహాసనం మీది నుండి తీర్పు చెప్పాడు. అతనికి కుడివైపున గొర్రెలూ ఎడమవైపున మేకలూ వున్నాయి. లోకాంతంలో ప్రభువు న్యాయాధిపతిగా వచ్చి తీర్పు చెప్పేపుడు అతని సిలువకూడ వుంటుంది. కాని అప్పడు సిలువ ఇప్పడులాగ అవమానాన్ని బాధలనూ సూచించదు, సంతోషాన్ని విజయాన్ని సూచిస్తుంది. ఐనా ఆ లోకాంతపు తీర్పులాంటిదే ఇప్పడు సిలువమీది తీర్పు కూడాను.

క్రీస్తుకి ఇరువైపులా ఇద్దరు దొంగలనుగూడ సిలువ వేసారు. వాళ్ళిద్దరికీ చాల వ్యత్యాసముంది. ఎడమప్రక్క ఉన్నవాడు క్రీస్తుని నిందించాడు, "నీవేగనుక మెస్సియావైతే మొదట నిన్ను నీవు రక్షించుకొని ఆ మీదట మమ్ముగూడ రక్షించు చూద్దాం" అన్నాడు - లూకా 23, 39. అతడు సిలువ వేదనలను భరించలేక ఈలా దుర్భాషలాడాడు. నరులు కేవలం బాధలవల్లనే పునీతులు కారు, శ్రమలను మంచి మనసుతో స్వీకరించకపోతే, వాటినిగూర్చి సుమ్మర్లు పడితే అవి మనలనింకా చెడగొడతాయి. ఇందుకు ఈ యెడమవైపు దొంగే నిదర్శనం.

కాని ఎడమవైపు దొంగ తన్ను సిలువమీదినుండి క్రిందికి దింపమని అడిగితే కుడివైపు దొంగ తన్ను సిలువ మీదినుండి పైకెత్తమని అడిగాడు, తన్ను కరుణింపమని క్రీస్తుని వేడాడు. అతడు తోడి దొంగను మందలిసూ "మిత్రమా! నీవు ఇతనిలాగే శిక్షకు గురయ్యావు. ఇతని లాగే మరణించనున్నావు. ఐనా నీకు దైవభయం ఏమాత్రం లేదా? ఈ మూర్ధప్రజల్లాగే నీవూ ఇతన్ని నిందిస్తున్నావా? మన నేరాలకు తగినట్లుగానే మనకు శిక్షపడింది. పాపం ఇతడు ఏ నేరమూ చేయలేదు. కనుక నీవు ఇంతటితో నోరుమూసికొంటే బాగుంటుంది" అని పల్కాడు.