పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/119

ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ స్థలం

క్రీస్తు దేహాన్ని స్లీవనుండి క్రిందికి దింపడం

క్రీస్తు చివరివరకు శ్రమలనుభవిస్తూ చనిపోయాడు. మిత్రులు అతని మృతదేహాన్ని క్రిందికిదింపి మరియమాత ఒడిలో పరుండబెట్టారు.

దేవునియొక్క విచిత్రకార్యం క్రీస్తు జీవితం. కాని ఈ జీవితపుష్పం పూర్తిగా విప్పారక మునుపే తలవని తలంపుగా వాడి నేలకొరిగింది. మామూలు ప్రకారంగా చెప్పాలంటే, క్రీస్తు ఇంకా యెన్నో యేండ్లు జీవించి వుండవలసింది. అలా జీవించివుంటే, అతడు ఇంకా యెన్ని సత్కార్యాలు చేసి వుండడు? ప్రజలకెన్ని మహత్తర సత్యాలను బోధించి వుండడు? లోకానికెంత మేలు చేసివుండడు? మరి యీ యెలప్రాయంలోనే క్రీస్తు ప్రాణాలు విడువనేల? ప్రభువు ఆరంభించిన పని పూర్తిగా పునాదులైనా ముగియక మునుపే ఆగిపోనేల?

క్రీస్తు ఎన్నుకొన్నది "సిలువయొక్క తెలివితక్కువతనం". నేలలోబడి చివికిపోయిన పిదపనేగాని గోదుమగింజ నూరంతలుగా ఫలింపదు.

ప్రపంచంలోని ప్రశ్నలన్నిటిలోను చిక్కు ప్రశ్నలివి. జనులు బాధపడనేల? సంతోషింప గలిగీ దుఃఖింపనేల? ఏదైనా సాధింపగలిగీ సాధింపక పోవడమేల? జీవించగలిగీ చనిపోవడమేల? జీవితపు మొగ్గ పూర్తిగా వికసింపక పూర్వమే గిల్లివేయబడనేల? ఇంత మధురంగా వుండే ఈ జీవితాన్నీ ఈ లోకాన్నీ మనుష్యప్రాణి ఇంత త్వరగా వదలిపెట్టిపోనేల?

ఈ ప్రశ్నలకు మనుష్యబుద్ధి తృప్తికరమైన సమాధానాలను చెప్పలేదు, వీటికి సిలువ యిచ్చే సమాధానమే సమాధానం. నేలలోబడి చివికిపోతేనేగాని గోదుమగింజ సత్ఫలితాన్ని ఈయలేదు. మన త్యాగం, బాధ, మరణం అసలు మన జీవితమే ఈ గోదుమగింజలాంటిది. బాధలకు జిక్కి ప్రాణాలు కోల్పోయిన నాడేగాని మన జీవితం, మనతోపాటు ఇతరుల జీవితం, సత్ఫలితాన్ని ఈయలేవు.

ప్రార్ధనం

ప్రభూ! నీవే సెలవిచ్చిన ఈ సత్యాన్ని నీవే ఆచరణలో పెట్టి చూపించిన ఈ పరతత్వాన్ని అనగా తనకుతాను చనిపోవడాన్ని పూర్ణహృదయంతో విశ్వసిస్తున్నాను. నీ పట్లగల నమ్మకంచే నా ప్రాణాలను కానుకగా అర్పించడానికి సిద్ధంగా వున్నాను.