పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంచనావేసారు ఆర్థికవేత్తలు. కాని ఎన్ని కుటుంబాలకు 1000 రూపాయల జీతం లభిస్తుంది? పైగా ఎన్ని కుటుంబాల్లో ముగ్గురు సభ్యులు మాత్రమే వుంటున్నారు? అందుచేత చాల కుటుంబాలు జీతాలు చాలక బాధపడి పోతూంటాయి. ఇక, జీతాలలోని వ్యత్యాసాలుకూడ మహాదారుణంగా వుంటాయి. ఒక ఆఫీసులో అందరికంటె పైయుద్యోగికి ఇచ్చే జీతం అదే ఆఫీసులో అందరికంటె క్రింది వుద్యోగికి ఇచ్చే జీతం కంటె 10 రెట్ల ఎక్కువ. ఇంత వ్యత్యాసం ఎందుకు? ఆపై యుద్యోగి అంతగా పొడిచేసిందేమిటి?

21. స్నేహితులకొరకు ప్రాణాన్ని ధారపోయటం - యోహా 15,13

తోడిప్రజలకు యథార్థంగా సేవచేయడమంటే కొన్ని మంచిమాటలు చెప్పడం మాత్రమేగాదు. కొన్ని పరిచర్యలు చేయడం మాత్రమేగాదు. ప్రాణాలు సమర్పించడంగూడ, కనుకనే క్రీస్తు స్నేహితులకొరకు ప్రాణాలు ధారవోయడమే ఉత్తమమైన ప్రేమ అన్నాడు. స్వార్థమానవునికీ పరార్ధమానవునికీ ఎంత వ్యత్యాసం! స్వార్థపరుడు తోడి నరులనుండి ఏదో పొందగోరుతూంటాడు. వాళ్ల కష్టాలనుజూచి సానుభూతి చెందడు. అసలు వాళ్లగోడు విన్పించుకోడు, కాని పరార్ధమానవుడు తోడినరులకు తానేదో ఈయగోరుతూంటాడు. కడకు వాళ్లకొరకు తన ప్రాణాన్నే సమర్పించుకొంటాడు.

మనది పారిశ్రామిక దేశం కాదు. మనదేశ ఆదాయం విశేషంగా వ్యవసాయంమీద ఆధారపడి వుంటుంది. మన ఆదాయంలో 46 శాతం వ్యవసాయం వల్లనే లభిస్తుంది. కాని ఈ వ్యవసాయరంగంలో దేశంలోని వనివాళ్లల్లో 70 శాతం వినియోగింపబడుతూన్నారు. ఇంతమంది ఈరంగంలో పనిచేయడంవల్ల వ్యవసాయ కూలీల వేతనాలు తగ్గిపోయాయి. వాళ్ల పనిచేయదగ్గరంగమా మరొకటిలేదు. కనుక ఈ కష్టజీవులు కూలి చాలడం లేదని నెత్తీనోరూ బాదుకొంటూంటారు. ఐనా వీళ్ల గోడు వినేదెవడు? పైగా చాలమంది కూలీలకు కూలి సంఘాలంటూ లేవు. కూలీలకు అన్యాయం జరిగినపుడు వాళ్ల కొరకు పోరాడి వాళ్ల హక్కులను నిలబెట్టేవాళ్లు తక్కువ. కనుక ఈ వర్గం ప్రజలు ఎన్నో కడగండ్లకు లోనౌతుంటారు.

22. గొర్రెల కొరకు నా ప్రాణాన్నే సమర్చిస్తాను - యోహా 10,15

క్రీస్తు తన ప్రజల కొరకు ప్రాణాన్ని సమర్పిస్తానని చాలసార్లు చెప్పాడు. అతడు మంచి కాపరి, తన మందల కొరకు ప్రాణాలను బలి యిచ్చేవాడు, అతడు మంచి విత్తనం లాంటివాడు. ఆ విత్తనం భూమిలోపడి చివికిపోతేనేగాని మొలకెత్తి నూరంతలుగా ఫలించదు - యోహా 12,24. ఆ క్రీస్తు లాగె మనంకూడ ప్రాణాలను సమర్పించేంతగా తోడి ప్రజలను ప్రేమించాలి.