పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనేది ధనవంతుల్లోను ఉండవచ్చు పేదల్లోను ఉండవచ్చు. విపరీతంగా ఆందోళన పడ్డం దేవుని విూద నమ్మిక లేకపోవడమే ఔతుంది.

13. నన్ను వెంబడింప గోరేవాడు తన్నుతాను నిరాకరించుకోవాలి - మత్త 16,24

నరునిలో ఓపెద్ద లోపం వుంది. అదే అతని స్వార్థం. ఈ స్వార్థం కొద్దీ అతడు తన సుఖాలను తాను వెదుకుకొంటాడు. ఇతరులమిూద దౌర్జన్యంచేసి వాళ్లకు రావలసిందికూడ తాను కొట్టేస్తూంటాడు. ఈ స్వార్గాన్ని అణచుకొన్నవాడుగాని దివ్య మానవుడూ క్రీస్తుశిష్యుడూ కాలేడు. అందుకే ప్రభువు తన్ను వెంబడింప గోరేవాడు తన్ను తాను నిరాకరించుకోవాలనీ తన సిలువను తాను మోసికొని రావాలనీ బోధించాడు. ఈలా నరుడు తన్ను తాను నిరాకరించుకోవడమూ క్రీస్తు సిలువను మోయడమూ నేర్చుకొన్నదాకా అతనిలోని స్వార్థం చావదు. ఈస్వార్థం చావకపోవడం వల్లనే అతడు సాంఘిక అన్యాయానికీ దౌర్జన్యానికీ తలపడుతూన్నాడు. మన దేశంలోని పేదప్రజలు విశేషంగా పల్లెల్లో జీవిస్తున్నారు. ఈ పల్లెల్లో వుండే విూది రెండు శాతం పల్లీయులకు పల్లెలకు లభించే మొత్తం ఆదాయంలో 25 శాతం లభిస్తూంది. క్రింది 20 శాతం పల్లీయులకు ఈ యాదాయంలో 1 శాతం మాత్రమే లభిస్తుంది. అనగా పల్లీయుల్లో కొద్దిమందికి మాత్రమే ఆదాయం పుష్కలంగా లభిస్తుంది. అధిక సంఖ్యాకులు నిరుపేదల్లా జీవిస్తున్నారు.

14. లోకాన్నంతటినీ జయించినా తన్నుతాను కోల్పోతే - మార్కు 8,36

నరుడు లోకాన్నంతటినీ జయించినా తన్నుతాను కోల్పోతే ఏమిలాభం అన్నాడు క్రీస్తు, ఇక్కడ తన్ను తాను కోల్పోవడమంటే యేమిటి? నరుడు తనకు తానూ దక్కడు. దేవునికీ దక్కడు. తోడి మానవునికీ దక్కడు. స్వార్థపరుడైన మానవుడు ఈలా తయారౌతాడు. అతడు అన్నీ తన కొరకే కూడబెట్టుకోబోతాడు. కాని అలా కూడబెట్టుకునే ప్రయత్నంలో దేవునికీ తోడి ప్రజలకూ దూరమైపోతాడు, నాశమైపోతాడు. ఈలా స్వార్థ మానవుడు ప్రపంచాన్ని వశం జేసికోబోతూంటాడు, ఆ పోకడలో తానే నాశమై పోతూంటాడు. ఈ స్వార్గాన్ని జయించిననాడే గాని సాంఘిక న్యాయాన్ని పాటించలేడు.

పల్లెల్లోని ప్రజలు చాలామంది పేదవాళ్ళన్నాం. వీళ్ళల్లో కొంతమంది జీవనోపాధి లభిస్తుందేమోనని ఆశతో పట్టణాలకు వచ్చి చేరుతూంటారు. కాని అక్కడ వాళ్ళకు పనులు దొరకవు. పల్లెలనుండి తెచ్చుకొన్నది కాస్త ఐపోతుంది. ఏమైనా మిగిలితే బాకీదారులకు కుదువ బెడతారు. ఈ రీతిగా ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఇక చేసేదిలేక ఏ మురికివాడల్లోనో పడి అఘోరిస్తూంటారు. ఈ రీతిగా పల్లీయులు చాలమంది పట్టణాలకు వచ్చి మోసపోతూంటారు.