పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/72

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్నో కోట్ల రూపాయల విలువచేసే బ్రహ్మాండమైన భవనాలూ, భూములూ వాహనాలూ ఈ దేశంలో శ్రీసభ అధీనంలో వున్నాయి. మనకు విద్యాసంస్థలూ ఆస్పత్రులూ సేవా సదనాలూ చాలా వున్నాయి. ఈ సంస్థలన్నిటినీ పోషించడానికి ఏటేట కోట్లకొలది విదేశ నిధులు - ప్రతియేడు కనీసం వేయికోట్లయినా - ఇండియాకు చేరుతున్నాయి. ఆలాంటప్పుడు మన శ్రీసభ పేదది ఏలా ఔతుంది?

ఇక ఈ శ్రీసభ అధికారులకున్న పలుకుబడి తక్కువదేమీ కాదు. మన విద్యాసంస్థలూ ఆస్పత్రులూ పెద్దపెద్ద నగరాల్లో వున్నాయి. ఈ దేశంలోని ధనవంతులూ బలవంతులూ ప్రభుత్వోద్యోగులూ మేధావులూ చాలమంది మన విద్యాసంస్థల్లో చదువుకొన్నారు, మన ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. కనుక మన పెద్దలు చిన్నదానికీ పెద్దదానికీగూడ వీళ్ళ పలుకుబడిని వినియోగించుకొని నానాసదుపాయాలు పొందుతూంటారు. ఇంకా ఈ పెద్దల్లో అల్పబుదలైనవాళ్లు ఒకోమారు ఈ పలుకుబడిని దుర్వినియోగం చేయడం గూడ కద్దు.

ఇక్కడే వచ్చింది చిక్కు. ఈ దేశంలోని విద్యావంతుల దృష్టిలోను బలవద్వర్గం దృష్టిలోను క్రైస్తవ శ్రీసభ పేదదికాదు, ధనవంతమైంది. విద్యా వైద్యాది నానారంగాల్లో సమర్థవంతంగా పనిచేసేది. కాని ఈ దేశీయులు మనలను సమర్థవంతంగా పనిజేసే ఓ సంస్థగా గుర్తిస్తారేగాని క్రీస్తు శిష్యులనుగా గుర్తించరు. అంటే మన సంస్థలతో, మన నిధులతో, మన శక్తిసామర్థ్యాలతో మనం క్రీస్తుకి సాక్ష్యం పల్కలేకపోతున్నాం. అతన్ని గూర్చి బోధించలేకపోతున్నాం. అనగా ఈ దేశంలో శ్రీసభ ధనవంతమైపోయినందున ప్రజలకు క్రీస్తుని చూపించలేకపోతూంది. స్వీయవైభవాన్నే ప్రపంచానికి చాటుకొంటూంది. ఇది మహా దౌర్భాగ్యం.

సంపదలు శోధనకు కారణమౌతాయన్నాడు క్రీస్తు. భారతదేశంలోని శ్రీసభ నేడు అచ్చంగా ఈ ప్రమాదానికే గురైంది. కనుక మన శ్రీసభ అనే సంస్థాదాని అధికారులూ పేదజీవితం గడపడం మొదలెట్టాలి. వైభవోపేతమైన భవనాలనూ ఆడంబరప్రియమైన వాహనాలనూ సుఖజీవనాన్నీ త్యజించాలి. మన పెద్దలు గౌరవప్రతిష్టలకు అర్రులు చాచడం మానుకోవాలి. సంస్థలమూలంగా గణించిన పలుకుబడిని స్వార్థానికి వినియోగించు కోకుండా వండాలి. అప్పుడే శ్రీసభ ఈ దేశంలో క్రీస్తుని బోధించగలిగేదీ, క్రీస్తుకి సాక్ష్యం పల్కగలిగేదీనీ. దీనికిగాను మన శ్రీసభకు కొన్ని హింసలూ కష్టాలూ గూడ రావాలి. కష్టాలపాలైనవాళ్ళ కళ్ళ తెరుస్తారు. ఆ కష్టాలు ఇప్పడు ఎంతో దూరంలో లేవు.