పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అతన్ని పొందకపోతే ఎన్ని యిహలోక వస్తువులు సంపాదించుకొన్నా లాభం లేదు. సిరిసంపదలు మనం దేవుణ్ణి విస్మరించేలా చేస్తాయి. వాటిల్లోని ప్రలోభం ప్రధానంగా యిదే.

ఈ సామెతలోని ధనవంతుణ్ణి బైబులు "అవివేకి" అని పిలుస్తుంది. దేవుడు లేడని చెప్పకపోయినా, నిత్యజీవితంలో ఏవేవో లోకవస్తువులతో సతమతమైపోతూ దేవుణ్ణి పట్టించుకోకుండా జీవించేవాణ్ణి బైబులు "అవివేకి" అని పేర్కొంటుంది. అవివేకియైనవాడు దేవుడు లేడులే అనుకొంటాడు అని చెప్తుంది - కీర్తన 14,1. అనగా అవివేకియైనవాడు దేవుని వనికిని నిరాకరించకపోయినా, అతన్ని పట్టించుకోవడం మాత్రం మానివేస్తాడు అని భావం. పై సామెతలోని ధనికుడుకూడ ఈలాంటివాడే. ఈ మనస్తత్వం నేటి మన లోకంలో అరుదేమీ కాదు. మనమందరమూ ఈ లోకవస్తువులను విరివిగా వినియోగించుకోవాలి అనే కోరిక కలవాళ్లమే. వస్తువ్యామోహంలోబడి దేవుణ్ణి విస్మరించేవాళ్ళమే. కనుక ఈ సామెత నేడు మన జీవితానికీ అక్షరాల అన్వయిస్తుంది.

2. సంపదలు దైవరాజ్యాన్ని పొందనీయవు

క్రీస్తు విత్తేవాని సామెత చెప్పాడు — లూకా 8,14. ఓ రైతు విత్తనాలు వెదజల్లుతూంటే కొన్ని ముండ్లపొదల్లో పడ్డాయి. అవి మొల్చి మొక్కలయ్యాయి గాని ముండ్లమధ్యలో వున్నందున అవిసిపోయాయి. దీని భావం ఏమిటి? ఈ విత్తనాలను పోలిన నరులు కొందరుంటారు. వీళ్ళ ప్రభువు వాక్యాన్ని ఆలిస్తారు, అంగీకరిస్తారు. కాని ప్రాపంచిక చింతలూ ధనవ్యామోహమూ వాళ్ళను అణచివేస్తాయి. కనుక వాళ్ళు దైవరాజ్యాన్ని పొందలేరు.

ఇంకా క్రీస్తు విందుసామెతనుగూడ చెప్పాడు — లూకా 14,15-24. ఈ విందు దైవరాజ్యానికి పోలికగా వుంటుంది. ఈ కథలో విందుకు ఆహ్వానింపబడినవాళ్లు ప్రపంచ వ్యాపారాల్లో నిమగ్నులై వున్నారు. కనుక వాళ్ళ విందుకు పోనేలేదు. అనగా సంపదలూ వస్తువ్యామోహమూ నరులను దైవరాజ్యాన్ని చేరనీయకుండా అడ్డుపడతాయని భావం.

ఇంకా ప్రభువు ఈలా చెప్పాడు. "ఎవడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. ఆ ఇద్దరిలో ఒకరిని ప్రేమించి మరొకరిని అనాదరం చేస్తాడు. ఆలాగే మీరూ దైవాన్నీ డబ్బునీ సేవించలేరు" - మత్త 6,24. ఈ సూత్రాన్ననుసరించి లోకంలోని నరులంతా దేవుణ్ణొ లోకవస్తువులనో ఎన్నుకొంటారు. అతన్ని పట్టించుకొనేవాళ్లు వీటిని పట్టించుకోరు. వీటిని పట్టించుకొనేవాళ్ళు అతన్ని పట్టించుకోరు. అనగా ధనం నరుని హృదయాన్నిభగవంతునినుండి వైదొలగిస్తుందని భావం. ధనాన్ని సేవించేవాడు దేవుణ్ణి సేవించలేడని గూడ భావం.