పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీతో నాకేమి యవసరం అనేకాడికి రావచ్చు
దరిద్రుణ్ణయితే దొంగతనానికి పాల్పడి
నీకే అపఖ్యాతి తేవచ్చు" - సామె 30, 8–9.

ఇవి సంగ్రహంగా ధనాన్ని గూర్చిన పూర్వవేద భావాలు. ఈ భావాలు యిస్రాయేలు ప్రజలు వ్యవసాయ పరమైన జీవితం గడిపినప్పుడు వెలిబుచ్చినవి. డబ్బువల్ల కలిగే శోధనలు అప్పటికి వాళ్ళకింకా అనుభావానికి రాలేదు. ధనం తెచ్చిపెట్టే ప్రలోభాలను అర్థంచేసికోవాలంటే నూత్న వేదంలో క్రీస్తు బోధలను తిలకించాలి.

2. క్రీస్తు బోధలు

పూర్వవేదం డబ్బుకి ఒకపాటి విలువ నిచ్చింది. దాన్ని దేవుని వరంగా గూడ ఎంచింది. క్రీస్తుకి ఈ పూర్వవేదభావాలు తెలుసు. ఐనా అతడు సాత్తుకి పూర్వవేద మిచ్చిన విలువ నీయలేదు. ప్రభువు దృష్టిలో ధనం నరుణ్ణి దేవునినుండీ తోడి నరులనుండీగూడ వైదొలగించేది. కనుక శిష్యుడు ధనాన్ని అతిజాగ్రత్తగా వినియోగించుకోవాలి. క్రీస్తుకి ప్రధానమైంది దైవరాజ్యం. అది అమ్యూలమైన నిధి. నరుడు తతిమ్మా సంపదలన్నిటినీ వదలుకొని అమూల్యమైన ఈ ఏకైక నిధిని సంపాదించుకోవాలి - మత్త 13,44.

ఇక, సంపదలను గూర్చిన క్రీస్తు భావాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. ధనికులు దేవుణ్ణి విస్మరిస్తారు

నరులు ఈ ప్రపంచ వస్తువులతోనే సతమతమైపోవడాన్ని క్రీస్తు తీవ్రంగా నిరసించాడు. ఓమారు ఓ కుటుంబంలోని సోదరులిద్దరు పోట్లాడుకొన్నారు. వారిలో ఒకడు క్రీస్తుని మధ్యవర్తిగా వుండి తమ ఆస్తిని పంపిణీ చేయమని కోరాడు. కాని క్రీస్తు వాళ్లకు తీర్పరిగా వుండడానికి నిరాకరించాడు. అత్యాసతో సిరినంపదలను కూడబెట్టుకోవడాన్ని గూడ ప్రభువు ఖండించాడు - లూకా 12, 13-15.

ఈ సందర్భంలోనే క్రీస్తు అవివేకియైన ధనికుని సామెత కూడ చెప్పాడు - 12, 16–21. ఓ ధనవంతుడు బాగా పంటలు పండించుకొని ధాన్యం నిల్వజేసికొన్నాడు. చాల యేండ్ల దాకా తిని త్రాగి సుఖిస్తాననుకొన్నాడు. దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. కాని దేవుడు ఆరాత్రే ఆ యవివేకి ప్రాణాలు కొనిపోయాడు. అతని యాస్తిపాస్తులు అన్యులపాలయ్యాయి. సిరిసంపదలను ప్రోగుజేసికోవడమే జీవిత ధ్యేయం కాదని ఈ సామెత భావం. ఈ లోక వస్తువులు అసలు వద్దని కాదు. కాని వాటి ఆర్థనే పరమావధి కాదు. అన్నిటికంటె విలువైనవాడు దేవుడు వున్నాడు. నరుడు ఆ భగవంతుణ్ణి సేవించి