పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దరిద్రులను సోమరిపోతులనుగా గణించినట్లే ధనవంతులను క్రియాపరులనుగా లెక్కకడుతుంది – 10,4. ఈ భావాలన్నిటినిబట్టి పూర్వవేదం సంపదలు మంచివే అనీ, ధనాన్ని కూడబెట్టినవాళ్ళ యోగ్యులే అనీ భావించినట్లుగా అర్థంచేసికోవాలి.

2. సంపదలు దేవుని వరం

పూర్వవేదం సంపదలను దేవుని వరంగాగూడ ఎంచుతుంది. దేవుడు తన భక్తులను పూర్ణాయుష్కులను చేస్తాడు. అతడనుగ్రహించే ఈ నిండు జీవితంలో చాల అంశాలున్నాయి. చాల యేండ్ల జీవించడం, మంచి ఆరోగ్యాన్ని అనుభవించడం, ప్రజల మన్నన పొందడం, సిరిసంపదలు ప్రోగుజేసికోవడం మొదలైనవన్నీ పూర్ణాయుస్సులో భాగాలే. ప్రభువు చేపట్టినవాడికి ఇక యే కొరతా వుండదు - కీర్త23, 1. ఎడారికాలంలో ప్రభువు తన ప్రజలకు మన్నానూ మాంసాహారాన్నీ సమృద్ధిగా దయచేసాడు. తర్వాత వాగ్డత్త భూమికి చేరాక గూడ వాళ్లు సుషుగా భుజించి చీకుచింత లేకుండ జీవిస్తారు. - లేవీ 26,5. ప్రజలు దేవళంలో తమ దేవుణ్ణి సేవించుకోవడానికి వచ్చినపుడు తనివిదీర విందు ఆరగిస్తారు. ప్రభువే గృహస్థఐ తన భక్తులచేత విందు కుడిపిస్తాడు - కీర్త23,5. ప్రభువు తన ప్రజల కృషినీ పంటనూ దీవిస్తాడు - ద్వితీ 16, 15. కనుక సంపదలను దేవుడిచ్చే దీవెనలనుగా ఎంచాలి. అసలు అతడు తన భక్తులకు వాగ్దత్తభూమినే soSoSno యిచ్చాడు. ఆ పెద్ద కానుకతోపాటు చిన్నకానుకలైన సిరిసంపదలనుగూడ దయచేస్తాడు. ఇక, యావే తన ప్రజలను తనవాళ్ళనుగా ఎంచి వాళ్ళకు దానాలు దయచేసేవాడు. ఆలాగే ప్రజలుకూడ అనాథులను తమ బిడ్డలనుగా గణించి వాళ్ళకు సహాయం చేస్తూండాలి - సీరా 4,10.

3. సంపద ప్రధానమైన భాగ్యం మాత్రం కాదు

సంపద వాంఛింపదగినదేఐనా ముఖ్యమైనది మాత్రం కాదు. దానికంటె ఉత్తమమైన భాగ్యాలు చాలా వున్నాయి. ధనంకంటె హృదయశాంతి మెరుగైంది - సామె 15,16. డబ్బుకంటె మంచిపేరు ముఖ్యమైంది - 22,1. ఆరోగ్యం కూడ డబ్బుకంటె దొడ్డభాగ్యమే - సీరా 30, 14 సిరిసంపదలు మనలను చావునుండి తప్పించలేవు - కీర్త 49,7. ఒకోమారు మనం కూడబెట్టుకొన్న సొమ్ముకు అన్యులు వారసులౌతారు - ఉపదే 6,2. కనుక డబ్బుకంటె వివేకం మెరుగైంది, కావుననే దేవుడు నీకేమి వరం కావాలో కోరుకొమ్మనగా సాలోమోనురాజు వివేకాన్ని కోరుకొన్నాడు - 1రాజు 3,9. అసలు వివేకాన్ని మించిన వరం లేదు. సిరిసంపదలేవీ ఆ భాగ్యంతో సరితూగలేవు - సామె 8,11.