పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోర్కెను తీర్చేది కూడ ఆత్మే ఆ ఆత్మ. మనం క్రీస్తుని అనుభవానికి తెచ్చుకొనేలా చేస్తుంది. అతని మూర్తిని మన హృదయ ఫలకం విూద చిత్రిస్తుంది. మనం అతని ఆశయాల ప్రకారం జీవించేలా చేస్తుంది, అతన్ని ఇతరులకు ఎరుక పరిచేలా చేస్తుంది.

ఈలాంటి వాక్యమే ప్రకటన గ్రంథంలో కూడ కన్పిస్తుంది. "నేను దాహం గొన్నవాణ్ణి జీవజలపు చెలమనుండి స్వేచ్చగా నీళ్ల త్రాగనిస్తాను" - 21,6. ఇక్కడ జీవజలపు చెలిమ పరిశుద్ధాత్మే. భగవంతుని విూద కోర్కె పట్టినవాడు పరిశుద్దాత్మను పొంది ఆ కోర్కెను తీర్చుకొంటాడు. ఎప్పడు కూడ క్రీస్తు విూద మనకు ఆశ పుట్టించేదీ, ఆ క్రీస్తుని మనం అనుభవానికి తెచ్చుకొనేలా చేసేదీ పరిశుద్ధాత్మే.

ఎలినబేతు ఇంట మరియ విన్పించిన మంగళగీతంలో "ప్రభువు ఆకలిగొన్నవాళ్ళను సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసాడు" అనే వాక్యం వుంది - లూకా 1,53. ప్రభువు ఆకలి గొన్నవాళ్ళను అన్నంతో సంతృప్తిపరుస్తాడు. ఆయన్నం ఏమో కాదు, తానే, తన దీవెనలే. అతడు తన్నుకోరుకొన్నవాళ్ళకు దర్శనమిస్తాడు. తన్నుతాను ప్రత్యక్షం చేసికొని వాళ్ళ హృదయాల్లోని కోరికలను తీరుస్తాడు. వాళ్ళకు తన వరాలిస్తాడు, వాళ్ళను దీవిస్తాడు.

"దప్పికగొనినవాళ్ళకు స్వచ్ఛమైన నీళ్ళ ఆనందాన్నిస్తాయి. అలాగే ప్రభు రక్షణాన్ని పొందినవాళ్ళకు ప్రమోదం కలుగుతుంది" అంటాడు యెషయా - 12,3. మంచి నీళ్ళు దప్పికను తీర్చినట్లే ప్రభు రక్షణ భాగ్యం మన హృదయాల్లోని కోర్కెలను తీరుస్తుందని ఈ వాక్యం భావం.

చాలమంది ప్రభువుని కోరుకొనే కోరుకోరని చెప్పాం. కనుక మనం మొదట ప్రభువుని ఆశించే భాగ్యం కొరకు మనవి చేసికోవాలి. అటుపిమ్మట ఆ కోరికకు ఫలసిద్ది నీయమని గూడ ప్రభువనే అడుగుకోవాలి. అనగా మన హృదయంలోని కోరికల ప్రకారం ప్రభువు మనకు అనుభవానికి రావాలని ప్రార్థించాలి.

2. కోరికను పుట్టించమని మనవి చేయాలి

ప్రజలకు చాలమందికి భగవంతుని విూద కోర్కెపుట్టదు గనుక, మన తరపున మనం ఆ ప్రభువుని కోరుకొనే భాగ్యం కొరకు అడుగుకోవాలని చెప్పాం. ప్రభువు సమరయ స్త్రీతో "నీవు దేవుని వరాన్ని గుర్తించి వున్నట్లయితే, నిన్ను నీళ్ళు అడుగుతుంది ఎవరో నీవు తెలిసికొని వున్నట్లయితే, నీవే అతన్ని నీళ్ళు అడిగేదానివి. అప్పడు అతడు నీకు జీవజలం ఇచ్చి వుండేవాడు", అన్నాడు - యోహా 4,10. కనుక మన హృదయాల్లో ఆ ప్రభువు విూద కోర్కెపట్టాలని అతన్ని అడుగుకోవాలి. అప్పుడు ప్రభువ మనకు జీవజలాన్ని,