పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరణ సమయంలో మా కొరకు ప్రార్థించండి అని దేవుని తల్లియైన మరియను అడుగుకొంటాం, ఇంకా, మంచి మరణానికి పాలకులైన జోజప్పగారిని మరణ సమయంలో మనలను ఆదుకొమ్మని అడుగుకొందాం.

ఈ సందర్భంలో క్రీస్తు అనుసరణ గ్రంథం ఈలా చెప్తుంది “మన పనులూ ఆలోచనలూ కూడ మనం ఈనాడే చనిపోతామో అన్నట్లుగా పండాలి. నీయంతరాత్మ సమాధానంగా వుంటే నీకు చావంటే భయం వేయదు. కనుక చావుకి భయపడ్డంకంటె పాపాన్ని విసర్జించడం మేలు. నీవు ఈనాడు చావుని ఎదుర్కొనలేకపోతే రేవుకూడ దాన్ని ఎదుర్కొన లేవు."

అసిస్సీ ఫ్రాన్సిస్ భక్తుడు మృత్యువుని బాగా అనుభవానికి తెచ్చుకొని ఈలా వ్రాసాడు.

“ఓ ప్రభూ! మా సోదరియైన మృత్యువుని

చేసినందుకు నీకు వందనాలు

చావుని ఏ నరుడూ తప్పించుకోలేడు

చావైన పాపంతో చనిపోయినవాళ్ళకు అనర్ధం

నీ చిత్త ప్రకారం జీవించేవాళ్ళు ధన్యులు

రెండవ చావైన నరకం వాళ్ళను బాధించదు".


వ్యాధిగ్రస్తులకు అభ్యంగనం చేసేటపుడు గురువు ఈ క్రింది ప్రార్థనను జపిస్తారు.

క్రైస్తవుడా! ఈ లోకంనుండి వెడలిపో

నిన్ను కలిగించిన సర్వశక్తిగల తండ్రి పేరుమీదిగా,

నీ కొరకు శ్రమలనుభవించిన

సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు పేరుమీదిగా,

నీ మీద కుమ్మరించబడిన పవిత్రాత్మ పేరు మీదిగా

క్రైస్తవ భక్తుడా! ఈ లోకంనుండి తరలిపో,

ఈ దినం నీవు సమాధానంతో జీవింతువుగాక

నీవు సియోనున దేవునితో వసింతువుగాక

దేవుని కన్యమాతయైన మరియతో,

జోజప్పగారితో, పునీతులతో,

సన్మనస్కులతో కలసి జీవింతువుగాక

నిన్ను మట్టినుండి కలిగించిన సృష్టికర్తను

నీవు మరల చేరుకొందువుగాక

నీవు ఈ జీవితంనుండి తరలిపోతూండగా

మరియ మాత, పునీతులు, సన్మస్కులు

నీ కెదురు వత్తురుగాక

నీ విమోచకుని నీవు ముఖాముఖి చూతువుగాక.