పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినేవారికొరకు మనం ప్రార్ధనం చేయాలి. మన ఉపన్యాసాలకంటె గూడ ఎక్కువగా మన ప్రార్థన ద్వారా ఇతరుల మనసు మారుతుంది. ప్రార్థనతోపాటు కొంత తపస్సు కూడ చేయడం మంచిది. ఉపవాసం మొదలైనవాటిని పాటించడం శ్రేయస్కరం.

3. వేదబోధ చేయగోరిన ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతుండాలి. వారితో మనకు వ్యక్తిగతమైన సంబంధం వుండాలి. పూర్వపరిచయం లేనివారికి దిడీలున మత విషయాలను చెప్లే వినరు. స్నేహం ద్వారా ఒక్క లౌకిక రంగంలోనేగాక ఆధ్యాత్మిక రంగంలోగూడ మంచి ఫలితాలను సాధించవచ్చు.

4. మన గురువులు, మఠకన్యలు, బ్రదర్లు మొదలైనవాళ్ళ చాలమంది సాంఘిక సేవ చేస్తుంటారు. విద్యాసంస్థలు నడుపుతూంటారు. ఆస్పత్రుల్లో సేవలు అందిస్తుంటారు. కాని వీళ్ళ మత విషయాలను అట్టే పట్టించుకోరు, క్రీస్తుని ప్రజలకు తెలియజేయరు. ఇది మంచి పద్ధతికాదు. మనం విద్యా వైద్య సాంఘిక సేవలు అందించేపుడు మన దగ్గరికి వచ్చినవాళ్లకు క్రీస్తుని గూర్చి కూడ చెప్పాలి. మనం ప్రభువు సేవకులమన్న సంగతిని ప్రజలు గుర్తించాలి. మన విశ్వాసాన్ని ఎన్నడు దాచిపెట్టుకోగూడదు.

5. మన క్రైస్తవ సమాజంలో కొందరు సంచార బోధకులుగూడ వుండాలి. వీళ్లు ఎప్పుడూ తావునుండి తావుకి కదలిపోయి క్రీస్తుని బోధిస్తుండాలి. ప్రజలను ప్రోగుచేసి వారిచే ప్రార్థన చేయిస్తుండాలి. ఆదిమ క్రైస్తవ సమాజంలో ఈలాంటి బోధకులు వుండేవాళ్లు

6. కొన్ని భక్తిగల కుటుంబాలను సందర్శించి అక్కడ క్రీస్తుని గూర్చి చెప్పి ప్రార్థన చేయిస్తే ఫలితం కలగవచ్చు.

7. మన క్యాతలిక్ సమాజంలో గురువులు సిస్టర్లు గృహస్థల సేవలను అంతగా వినియోగించుకోరు. ఇది పెద్ద పొరపాటు. అంతా మనం చేయలేం. మనం చేయలేని పనులు మన గృహస్థలు చేయగలరు. వాళ్లద్వారా గూడ పవిత్రాత్ముడు మాటలాడతాడు. కనుక మనం వారికి ముందుగా తర్ఫీదునిచ్చి వారిని వాక్యపరిచర్యకు వినియోగించుకోవాలి. గృహస్థల సేవలను వినియోగించుకోందే మనదేశంలో తిరుసభ వ్యాప్తి చెందదు. ఇక, గృహస్థలు వాళ్ళ తరపున వాళ్లు ఆత్మ తమకు దయచేసిన వరాలను వినియోగించుకొని వేదబోధ చేయాలి. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లంతా ఆ ప్రభుకి సాక్షులుగా వండాలి, అతన్ని గూర్చి బోధించాలి.

8. బైబులు వాక్యం భగవత్రేరితమైంది. కనుక ప్రజల హృదయాలను నేరుగా తాకుతుంది. దానిలో గొప్ప శక్తి వుంటుంది. కనుక దైవవాక్కునే ఎక్కువగా బోధించాలి.