పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97. ఓసారి లోకంవైపు చూడండి. దేవుణ్ణి ఆరాధించి గౌరవించేవాళ్లు ఎంతమంది? అతని చిత్తప్రకారం జీవించేవాళ్లు ఎంతమంది? ఎన్ని తావుల్లో జనులు అతని దివ్యనామాన్ని విస్మరిస్తున్నారో చూడండి. ఎన్నిచోట్ల ప్రజలు అతన్ని దూషిస్తున్నారో గమనించండి. నరులు అతని బోధలను ఏలా పెడచెవిని పెడుతున్నారో పరికించండి. ఈ కారణాలన్నీ మనం భక్తితో జీవించాలని ఉద్బోధించడం లేదా?

98. గురువులు కావడానికి సెమినరీల్లో చదువుకొనే బ్రదర్లు తామింకా దైవసేవ చేపట్టలేదుకదా అని నిరుత్సాహం చెందకూడదు. తామింకా అధ్యాత్మిక రంగంలో తోడి నరులకు ఉపయోగపడ్డం లేదుకదా అని విచారించకూడదు. వాళ్ళ సెమినరీలో వుండగానే దేవునికి సేవచేయవచ్చు, తోడివారికి ఉపయోగపడవచ్చు. నాలు మార్గాల ద్వారా వాళ్ళు ఈ కార్యాన్ని సాధించవచ్చు. మొదటిది, బ్రదరు తమ చదువులను ప్రభువుకి అర్పించుకోవడం ద్వారా. ఇవ్పడు చదువుకొంటే తర్వాత తొడివరికి ఉపయోగపడవచ్చుగదా! యుద్దానికి తర్ఫీదుపొందే సైనికులు తర్వాత రాజకి ఉపయోగపడరా? అలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యనేర్చుకొనేవాళ్ళు తర్వాత దాన్ని ప్రజలకు బోధించరా? రెండవది, వాళ్లు సెమినరీలో పుణ్యాన్నీ పవిత్రతను ఆర్థించడంద్వారా, ఇక్కడ తాము పవిత్రులైతే తర్వాత లోకంలోని ప్రజలను పవిత్రులను చేయవచ్చుకదా? భౌతిక రంగంలో బిడ్డను పట్టించాలంటే మొదట తండ్రి వుండాలి. ఆలాగే ఆధ్యాత్మికరంగంలోకూడ నరులను పవిత్రులను చేయాలంటే మొదట పవిత్రుడైనవాడు ఒకడుండాలి. మూడవది, వాళ్లు మంచి ఆదర్శాన్ని చూపించడంద్వారా, మన బోధవల్లకంటె మన ఆదర్శంవల్ల నరులు త్వరగా మారతారు. నాల్గవది, మంచి కోరికలు కోరడంద్వారా, నరులు దేవుని దగ్గరికి రావాలనీ భక్తిని అలవర్చుకోవాలనీ పుణ్యజీవితం గడపాలనీ బ్రదరు కోరుకోవాలి. ఈ కోరికలు మన మర్పించే ప్రార్థనల్లాగే ఇతరులమీద బలంగా పని చేస్తాయి.

99. ఒకసారి బ్రదరు పాల్మియోకు రోము నందలి యేసుసభ భవనంలోని పెద్దదేవాలయంలో ఆదివారం ప్రసంగం చేసే అవకాశం లభించింది. అతడింకా గురుపట్టం పొందలేదు. పాల్మియో తన ప్రసంగాన్ని గూర్చి కంగారుపడజొచ్చాడు. తన ప్రసంగం వినడానికి ఎక్కువమందిని రాబట్టాలనే కోర్కెకూడ అతనికి మిక్కుటంగా వుంది. అతడు రోడ్డమీద నడచిపోతూండగా ఓ ముసలమ్మ ఎదురుపడింది. ఆమె బిచ్చగత్తె. పాల్మియో ఆమెను తన ప్రసంగాన్ని వినడానికి ఆదివారం గుడికిరమ్మని ఆహ్వానించాడు. ఈ సంగతి ఇగేష్యస్ చెవినిబడింది. అతడు పాల్మియో ఆసక్తిని మెచ్చుకొన్నాడు. కనుక ఆ బ్రదర్ని తన గదికి పిలిపించి అతనికేదో చిన్న పనిని ఒప్పజెప్పాడు. "పాల్మియో! నీవీ కార్యాన్ని సాధించుకొని వచ్చావంటే ఆదివారం నీ ప్రసంగం వినడానికి నేను ఇద్దరు ముసలమ్మలను పంపుతాను" అని హాస్యంగా పలికాడు.