పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7 పునీత ఇగ్నేష్యస్ సూక్తులు

బైబులు భాష్యం - 108

1. నిరీక్షణం

1. మనంచేసే పనులన్నిటిలోను ఈ క్రింది సూత్రాన్ని పాటించాలి. ఓ వైపున మనం చేపట్టే కార్యాల విజయం దేవునిమీదగాక మనమీదనే ఆధారపడివుందో అన్నట్లుగా పనిచేయాలి. మరోవైపున ఆ పనులు మన కృషివల్లగాక దేవుని సహాయంవల్లనే సఫలమౌతాయో అన్నట్లుగా భగవంతుణ్ణి నమ్మాలి.

2. మన తరపున మనం దేవుని వరాలను స్వీకరించలేక అలసిపోతామేమోగాని, దేవుడు మాత్రం వాటిని ఈయలేక అలసిపోడు.

3. ఓ వున్నతాధికారంలోవున్న వ్యక్తి ఇగ్నేప్యస్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడనీ, అతడు ఇగ్నేప్యస్ సంకల్పించిన కార్యాన్ని భగ్నం చేయవచ్చుననీ ఎవరో ఇగ్నేప్యస్తో చెప్పారు. ఆ మాటలకు ఇగ్నేప్యస్ "ఈ లోకమంతా కలసి నన్ను నాశంచేయడానికి పూనుకొన్నా అంతకంటే అదనంగానే దేవుడు నన్ను రక్షించడానికి ముందుకి వస్తాడు. ఆ సమయం వచ్చినపుడు నీవే ఈ సత్యాన్ని గుర్తిస్తావు" అని పల్మాడు.

4 దేవుడు గడ్డిమొక్కలను సుందరమైన పూలు తొడుగుతాడు. ఆకాశపక్షులకు ఆహారం అందిస్తాడు. అవి విత్తనాలు విత్తవు, పైరు కోయవు, ధాన్యం గాదెల్లో దాచుకోవు. అలాంటి ప్రభువు ఏ జీతంలేకుండానే తన ద్రాక్షతోటలో శ్రమజేసే పనివాళ్ళ అక్కరలు తీర్చడా?

5. దేవుని కొరకు గొప్పకార్యాలు సాధించగోరేవాడు కేవలం తన తెలివితేటల మీదను శక్తిసామర్థ్యాలమీదను మాత్రమే ఆధారపడకూడదు. అపోస్తలులు కొద్దిమంది తెలివిలేనివాళ్ళ లోకం దృష్టిలో ఎందుకూ పనికిరానివాళ్ళు ఐనా వాళ్లు లోకాన్ని క్రీస్తుకి జయించి పెట్టడానికి పూనుకొన్నారు. సిలువతో ఈ లోకపు రాజులనూ జ్ఞానులనూ జయించబూనారు. తమ శక్తివల్లగాక క్రీస్తు బలంవల్ల గెలుస్తామని వాళ్ళకు తెలుసు.