పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్పిపోయిన గొర్రెలాగ భుజాల మీద మోసికొని రాబడ్డాడు. దుడుకు చిన్నవాని సామెతలో భగవంతుని చేరడానికి నరుడు చేసే ప్రయత్నం వ్యక్తమౌతుంది. తప్పిపోయిన గొర్రెసామెతలో నరుణ్ణి చేరదీసికోడానికి భగవంతుడు చేసేప్రయత్నం ద్యోతకమౌతుంది. స్వీయప్రయత్నంవల్ల నైతేనేం, భగవత్ర్పయత్నంవల్ల నైతేనేం, మనమూ ప్రభువును చేరుకోవాలని వేడుకుందాం.

63. క్రీస్తు ద్వారా నరుడు దేవుణ్ణి చేరుకుంటాడు

క్రీస్తు మన పాపాలను భరించాడు. కాని మన పాపాలను భరించడంవల్ల క్రీస్తు పాపాత్ముడు కాలేదు. అతడు మన పాపాలు తెచ్చిపెట్టిన దుష్ఫలితాన్ని మాత్రం స్వీకరించాడు. పాపపు నరుని ఆకృతిని పొంది, పాపపు దుష్ఫలితమైన మరణాన్ని అనుభవించాడు. నరుని మళ్ళా దేవుని యొద్దకు చేర్చాలంటే అతడు నరుని పాప ఫలితమైన మరణాన్ని అనుభవించి తీరాలి. కాని క్రీస్తు ప్రేమకొద్దీ కేవలం మరణాన్నేగ్రాదు, నీచాతినీచమైన సిలువ మరణాన్ని ఎన్నుకున్నాడు.

ఈలా మరణించి క్రీస్తు ఉత్థానమయ్యాడు. తండ్రి వద్దకు మరలిపోయాడు. తాను పాపానికి చనిపోయి దైవ జీవితానికి ఉత్థానమయ్యాడు - రోమ 6,10. ఉత్తానం ద్వారాతాను ఆత్మను పొందాడు. నరులకూ ఆ యాత్మను అందించాడు - 1కొ 15, 45. అయితే యీ క్రీస్తు ఉత్తానమయ్యేవాళ్ళకందరకూ ప్రథమఫలం - 1 కొ 15,20. అనగా అతని ఉత్థానం మన ఉత్తానాన్ని సూచిస్తుంది, సాధించి పెడుతూందిగూడ.

ఈ క్రీస్తుద్వారా, ఈ క్రీస్తుతోపాటు, మనమూ తండ్రివద్దకు మరలిపోతాం. ఈలా మరలిపోవడమనేది, మనం క్రీస్తును విశ్వసించినప్పుడూ, క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినప్పుడూ ప్రారంభమౌతుంది. క్రీస్తును విశ్వసించడం ద్వారా మనమందరం కుమారునియందు కుమారులమౌతాం-గల 8, 26. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా ఆ ప్రభు మరణాన్ని పునరుత్థానాన్ని మనమూ అనుభవిస్తాం; అతనికి సదృశుల మౌతాం - రోమా 6, 3–5. ఈవిధంగా క్రీస్తు ద్వారా తండ్రివద్దకు మరలిపోవడమనే మహాకార్యం ఈ జీవితంలో ప్రారంభమౌతుంది. మనం ఉత్థానమయ్యాక మరు జీవితంలో సంపూర్ణమౌతుంది.

క్రీస్తు మనఉత్థానాన్ని సూచిస్తూ ప్రథమ ఫలంగా తాను ఉత్తానమయ్యాడన్నాం. తండ్రివద్దకు సాగిపోయాడన్నాం. ఇది క్రీస్తు రక్షణం - 1 కొ 15,20. ఇక, అతన్ని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందినట్లయితే అతని ద్వారా మనమూ ఉత్తానమై తండ్రివద్దకు మరలిపోతామన్నాం. ఇది మన రక్షణం - రోమ 6, 3–4. కనుక ఈ రక్షణం క్రీస్తు రక్షణమని, క్రీస్తునందు మన రక్షణమనీ రెండు రూపాలుగా వుంటుంది.