పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43. లోకముయొక్క పాపాలను భరించే గొర్రెపిల్ల - యోహా 1, 29.

ఇంతవరకు తొలి మూడు సువార్తలను గాలించి చూచాం. ఇక నాల్గవ సువార్తాకారుడుగూడ పాపాన్ని గూర్చి కొన్ని విశేషభావాలు సూచించాడు. ఈ భావాలను కొన్నింటిని పరిశీలించి చూద్దాం. క్రీస్తు తనవద్దకు రావడం చూచి స్నాపక యోహాను “ఇదిగో లోకముయొక్క పాపాలను భరించే దేవుని గొర్రెపిల్ల' అంటాడు - యోహా 1, 29. ఇక్కడ పాపాలను భరించడమనగా పాపాలను పరిహరించడమని భావం. కాని క్రీస్తు మన పాపాలను ఎలా పరిహరిస్తాడు? క్రీస్తుజ్ఞానస్నాన సమయంలో ఆత్మ అతని మీదకు దాగిరావడం చూచి యోహాను ఇలాగన్నాడు. చనిపోయిన క్రీస్తు పార్శ్యంనుండి, నెత్తురు నీళ్ళ వుబికి వచ్చాయి. ఈ నెత్తురు దివ్యసత్రసాదాన్ని సూచిస్తుంది. ఈ నీళ్ళ జ్ఞానస్నానాన్నీ దానిద్వారా పరిశుద్ధాత్మనూ సూచిస్తాయి - యోహా 7, 38-39. అందుకే మరోతావులో యేసు చనిపోతూ "తలవంచి ఆత్మను అప్పగించాడు" అని చెప్పబడింది. యోహా 19,30. ఇక్కడ ఆత్మను అప్పగించాడనగా చనిపోయాడనీ, తన పరిశుద్దాత్మను విశ్వాసులకు అనుగ్రహించాడనీ రెండర్దాలు వస్తాయి.

ఇక, అపోస్తులులు క్రీస్తునుండి యీ యాత్మను పొందుతారు. జ్ఞానస్నానం ఈయడంద్వారా యీ యాత్మను ఇతరులకు అందిస్తారు. ఈ యాత్మద్వారా ఇతరుల పాపాలను పరిహరిస్తారు. ఎప్పడూ పరిశుద్ధాత్మద్వారానేగాని మనకు పాపపరిహారం జరగదు. కనుక స్నాపక యోహాను ప్రకారం, క్రీస్తు మన పాపాలను భరిస్తాడు లేక పరిహరిస్తాడు అనగా, అతడు మనకు పరిశుద్ధాత్మద్వారా జ్ఞానస్నానమిస్తాడని భావం - యొహా 1. 33

44. చీకటి వెలుగులు - యోహా 3, 20

యోహాను సువార్తలో చీకటి వెలుగు అనే ద్వంద్వ భావాలు కనిపిస్తాయి. వెలుగనగా క్రీస్తు, లేక క్రీస్తు వరప్రసాదం, చీకటి యనగా పాపం. పాపి వెలుగువద్దకు రావడానికి నిరాకరిస్తాడు - యోహా 8, 19, వెలుగంటే అతనికి భయం. కనుక ఆ వెలుగును ద్వేషిస్తాడు. ఈలా ద్వేషించడం గూడ తెలియకగాదు, తెలిసే, ಬುద్దిపుర్వకంగానే కనుక యీ పాపానికి నిష్కృతి లేదు - 9, 41.

45. వాళ్ళ నన్ను నిర్దేతుకంగా ద్వేషించారు - యోహా 15,25

పాపి వెలుగును ద్వేషిస్తాడు అన్నాం. క్రీస్తు అద్భుతాలద్వారా అతడు దైవకుమారుడని తెలిసికునే అవకాశం వుంది. కాని యూదులు క్రీస్తు అద్భుతాలనూ క్రీస్తునూ నిరాకరించారు. ఆ క్రీస్తును ద్వేషించారు కూడ - యోహా 15,23-24. ఇదే వాళ్ల మహా పాపం. తెలిసి చేసిన పాపం గనుక దీనికి పరిహారం లేదు.