పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/220

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంప్రదాయాలు బోధించేవాళ్లు, ప్రభువు మోషే నాయకత్వాన తమ పితరులను ఐగుప్న నుండి ఏలా తరలించుకొని వచ్చాడో తెలియజెప్పేవాళ్లు ఈ పిల్లలు మళ్ళా తమ పిల్లలకు గూడ ఈ యంశాలు బోధించేవాళ్లు, యూదుల కుటుంబ జీవితం మరజీవితం లాంటిది. భక్తిశ్రద్ధలతో కూడింది. ప్రవక్త యిర్మీయా “యిప్రాయేలు కుటుంబాలన్నిటికీ ప్రభువు దేవుడు. వాళ్ళంతా అతని ప్రజలు" అని వాకొన్నాడు – 31.1. ఈ భావాన్ని మనసులో పెట్టుకొనే నూత్నవేద రచయితలు క్రైస్తవ ప్రజను "దైవ కుటుంబం" అని పేర్కొన్నారు - 1 పేత్రు 4, 17. అంటే క్రైస్తవులమైన మనం దేవునికి చెందిన ప్రజలం, భక్తి భావంతో అతన్ని పూజించే ప్రజలం అని భావం, మనకు తల్లీ దండ్రీ నాథుడూ సర్వస్వమూ ఆ ప్రభువేనని అర్థం. నేటి క్రైస్తవులకు భగవంతుని పట్ల ఈలాంటి భక్తి భావాలు లోపించడం శోచనీయం.

2. తల్లీ తండ్రీ పిల్లలూ

పౌలు ఆనాటి క్రైస్తవులకు కుటుంబ ధర్మాలు కొన్ని గుర్తుచేసాడు. కుటుంబంలో తల్లీ తండ్రీ బిడ్డలూ ప్రధానవ్యక్తులు.

కుటుంబానికి యజమానుడూ దాన్ని పోషించేవాడూ తండ్రి. ప్రతి తండ్రీ పరలోకం లోని తండ్రికి పోలికగా వుంటాడు - ఎఫె 3,15. క్రీస్తు శ్రీసభను ప్రేమించినట్లే అతడూ తన భార్యను ప్రేమించాలి - ఎఫే 5,25, పిల్లలను చక్కగా పెంచాలి. వాళ్ళకు శిక్షణ గరపి ప్రభువును గూర్చి బోధించాలి -6,4. అతనికెవరైనా సేవకులుంటే తనకూ ఆ పనివాళ్ళకూ గూడా ఒకే యజమానుడున్నాడని గుర్తించి వాళ్ళ పట్ల దయతో ప్రవర్తించాలి - 6,9.

తండ్రి తరువాత కుటుంబంలో ప్రముఖ వ్యక్తి తల్లి, శ్రీసభ క్రీస్తుకిలాగే తానూ భర్త అధికారానికి లొంగివుండాలి - 5,24. ఆమెకు సంతానం ముఖ్యమే. కాని సంతానం కంటె గూడ అధికంగా భర్త మఖ్యం. స్ర్తీకి బిడ్డలకంటె కూడా ప్రముఖమైంది, భర్తతో గూడి ప్రేమభావంతో జీవించగల్గడం - 1కొ 11,8. కుటుంబ జీవితంలో పిల్లల కంటె ముందు వచ్చేవాళ్లు భార్యాభర్తలు గదా! ఐనా ఆమె పిల్లలను గూడ అనురాగంతో పెంచగలిగి వండాలి.

కడపట పిల్లలు. పిల్లల పుట్టువు తల్లిదండ్రుల నుండి గదా! కనుక వాళ్లు తల్లిదండ్రులకు విధేయులై యుండాలి - ఎఫె 6,1-3. తల్లిదండ్రుల నుండి వేదవిద్యను నేర్చివుండాలి. - 6,4. ఆ తల్లిదండ్రుల్లో దేవుణ్ణి చూడగలిగి వుండాలి. అమ్మా నాన్నా వృద్దులై నిస్సహాయస్థితిలో వున్నపుడు వాళ్ళను పోషించాలి - 1తిమొు 5,4.

కుటుంబ సభ్యులు, పౌలు పేర్కొన్న ఈ ధర్మాలను భక్తిభావంతో మననం చేసికొంటే సంసారపు బెడదలను కొంతవరకైనా తొలగించుకోవచ్చు.