పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. విచారానుభూతిలో వున్నపుడు ఏంచేయాలి? విచారానుభూతి ఎప్పడూ పిశాచం వల్లనే కలుగుతుంది. కాని పైన పేర్కొన్న మూడు కారణాలను బట్టి దేవుడు విచారానుభూతిని అనుమతిస్తుంటాడు. ఇది పిశాచం నుండి వచ్చే అనుభూతి కనుక మన తరపున మనం దీనినుండి వైదొలగే ప్రయత్నం చేస్తూండాలి. విశేషంగా మనం మూడు కార్యాలు చేయాలి. మొదటిది, ఆనందానుభూతి లాగే విచారానుభూతి కూడ తాత్కాలికంగా వుండే మనోభావం. పైగా ఈ స్థితిలో పిశాచం మనలను ప్రబోధిస్తూంటుంది. కనుక ఈ స్థితిలో వున్నపుడు మనం పూర్వం తీసికొన్న నిర్ణయాలను గాని మాటపట్టలను గాని మార్చుకోగూడదు. క్రొత్త నిర్ణయాలను చేపట్టనూగూడదు. రెండవది, మనకు రుచించకపోయినాసరే అధికంగా ప్రార్ధనం చేసికొని ప్రభు సహాయం అడుగుకోవాలి. ఆ విచారానుభూతి దాటిపోవాలని వేడుకోవాలి. మూడవది, మన తరపున మనం గొప్ప ఓర్పునూ నమ్మికనూ చూపాలి. చీకటి గతించిపోయాక వెలుగు వస్తుంది. అలాగే విచారానుభూతి దాటిపోయాక ప్రభువు మల్లా ఆనందానుభూతిని ప్రసాదిస్తాడు. ఆ పుణ్యకాలం కోసం ఓపికతో వేచివుండాలి. విచారానుభూతిలో వున్నపుడు గూడచాలినంత దైవవరప్రసాదం మనమిూద పనిచేసి మనం పిశాచానికి దొరికిపోకుండా వుండేలా తోడ్పడుతూనే వుంటుంది .

4. పిశాచ శోధనలు

12. పిశాచం మనలను శోధిస్తుంది. మోసగిస్తుంది. సాతాను మొదట ఆది దంపతులను శోధించి వాళ్లు దైవాజ్ఞ మిూరేలా చేసింది. కయానును శోధించి అతని చేత హేబెలును హత్య చేయించింది. యూదనాయకులను శోధించి క్రీస్తును చంపించింది. ఈలాగే మన జీవితంలో గూడ నానాశోధనలూ మోసాలూ తెచ్చిపెడుతుంది. కనుకనే బైబులు పిశాచాన్ని "శోధనకారుడు" అని పేర్కొంటుంది- మత్త 4,3. భక్తుడు ఇగ్నేష్యన్ పిశాచం మనలను మోసగించే తీరును వివరిస్తూ మూడు ఉపమానాలు వాడాడు. ఆ మూడింటినీ క్రమంగా పరిశీలిద్దాం. దయ్యం పురుషునితో పోరాడే గయ్యాళి స్త్రీ లాంటిది, పురుషుడు దౌర్బల్యం జూపితే గయ్యాళి అతన్ని లొంగదీసికొంటుంది. కాని పురుషుడు ధైర్యంతో ఎదిరించి నిలిస్తే గయ్యాళి తానే లొంగిపోతుంది. పిశాచం గూడ అలాగే. మనం దానికి జడిసి దాని దుర్బోధలకు సులభంగా లొంగిపోతే అది మనలను వశం జేసికొంటుంది. కాని ధైర్యంగా దాన్ని ఎదిరించి నిలిస్తే, దాని శోధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, అది పారిపోతుంది. దయ్యం కట్టివేసిన కుక్కలాంటిది. ఆ దుష్టమృగం చెంతకు వెత్తేనే గాని అది మనలను కరవలేదు. అది నేరుగా మన ఆత్మను చేరలేదు. మన యింద్రియాల విూద పనిచేసి పరోక్షంగా మన ఆత్మను చేరుతుంది. అది మన హృదయ