పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/169

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8.సదసదాత్మ విచారం

బైబులు భాష్యం - 23

విషయసూచిక

1. ప్రారంభ విషయాలు 162
2. ఆనందానుభూతి 164
3.విచారానుభూతి 166
4.పిశాచ సోధనలు 167
5.ఇగ్నేష్యను అనుభవాలు 170
6.దేవుడే భక్తులను నడిపిస్తున్నాడు 173
7.క్రీస్తు బోధలు 175
8.పరిశుద్ధాత్మ 177

మనవి మాట

[ఇది బైబులు భాష్యం 23వ సంచిక. దీనికి "సదసదాత్మ విచారం" అని పేరుపెట్టాం. సత్+అసత్+ఆత్మ+విచారం అని పదాలు విభజించుకోవాలి. సదాత్మ అంటే పరిశుద్ధాత్మ అసదాత్మ అంటే పిశాచం. ఈ రెండాత్మలూ మనలను నడపించే తీరు తెలిసి కోవడమే సదసదాత్మ విచారం. దీన్నే ఇంగ్లీషులో Discernment of Spirits అంటారు.

పరిశుద్ధాత్మ పిశాచమూ మనల నేలా నడిపిస్తుంటాయో తెలిసికోవడం ఆధ్యాత్మిక జీవితానికి చాలముఖ్యం. ఐనా నేటి క్రైస్తవులకు ఈ రంగంలో అట్టే అనుభవం లేదు. ఈ పొత్తమునందలి తొలి ఐదధ్యాయాల్లోని భావాలను ఇగేష్యస్ లొయోలా గారి "తపోభ్యాసాలు" అనే గ్రంథం నుండి స్వీకరించాం. ప్రాచీన క్రైస్తవ భక్తులందరిలోను ఇన్యాసివారు సదసదాత్మల ప్రబోధాలను అర్థం చేసికోవడంలో దిట్ట, కడపటి మూడధ్యాయాల్లోని భావాలను నూత్నవేదం నుండి గ్రహించాం.

పరిశుద్దాత్మా దేవదూతలూ ఒక జట్టుగాను, పిశాచమూ దాని దూతలూ ఇంకొక జట్టుగాను మనలను నడిపిస్తుంటారు. ఈ యాత్మలు మనలను ప్రబోధించే తీరు తెలిసికోవడం కొంతవరకు కష్టమే. ఐనా ఈ రంగంలో గడించే కొద్దిపాటి అనుభవం గూడ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక పాఠకులు సదసదాత్మ ప్రబోధాలను గూర్చి ఈ పొత్తం వివరించే సూత్రాలను జాగ్రత్తగా గుర్తించాలి. దేవుని బిడ్డలను దేవుని ఆత్మే నడిపిస్తుంటుందని తెలిసికోవడం గొప్ప భాగ్యం గదా!]