పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/122

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1.ఇతరులు బాధల్లో వున్నపుడు అవి మన బాధలో అన్నట్లు సానుభూతి చూపాలి.
2.వాళ్ళ అభివృద్ధిని మన అభివృద్ధినిగా భావించి సంతోషించాలి.
3.వాళ్ళ బలహీనతలనూ, వాళ్లు మనకు చేసిన అపకారాలను గూడ ఓర్పుతో సహించాలి.
4.వాళ్ళతో ఆప్యాయంగా మెలగాలి, వాళ్ళ క్షేమాన్ని కాంక్షించాలి.
5.వాళ్లు మనకంటే అధికులని భావించి వాళ్ళపట్ల గౌరవమర్యాదలతో మెలగాలి.
6.వాళ్ళతో ఒద్దికగాను శాంతిసమాధానాలతోను జీవించాలి,
7.వాళ్ళ ఆత్మరక్షణం కొరకు మన ప్రాణాన్ని అర్పించడానికి గూడ సిద్ధంగా వండాలి.

30. ప్రేమతోనే అన్ని పనులూ - 1కొ 16,14

పౌలు సోదరప్రేమకు ఎంత విలువనిచ్చాడంటే, మనం ఏపని చేసినా ప్రేమతోనే చేయాలి అన్నాడు. ప్రేమతో చేసినపనికి విలువుంటుంది. అలా చేయనిపనికి, అది యెంత పెద్దదైనా సరే, విలువవుండదు. మరో తావులో అతడు మనం ప్రేమలో నడవాలని చెప్పాడు, అనగా మనం ప్రేమతో నడచుకోవాలని భావం. మన ప్రవర్తనం ప్రేమతో నిండివుండాలని అర్థం - ఎఫే 5,13. అన్నిపనులు ప్రేమతో చేయాలి అన్నా ప్రేమవర్తనం అలవర్చుకోవాలి అన్నాభావం ఒకటే. మనం ప్రేమ పూర్వకంగా జీవించాలని ఫలితార్థం. అగస్టీను భక్తుడు "మొదట ప్రేమించు. ఆ తర్వాత నీవు ఏమి చేసినా చెల్లుతుంది. మన హృదయంలో ప్రేమ బీజం వండాలి. ఆ బీజంనుండి ప్రేమాంకురం తప్పితే మరో మొలక మొలవదు" అన్నాడు.

31. ప్రేమ చాలా పాపాలను కప్పిపెడుతుంది - 1 పేత్రు 4,8

ప్రేమ చాలా పాపాలను కప్పిపెడుతుంది అంటుంది పేత్రుజాబు. "ప్రేమ దోషాలన్నిటినీ కప్పివుంచుతుంది" అని చెప్పంది సామెతల గ్రంథం - 10,12. అనగా ప్రేమగల నరుడు తోడిజనుల తప్పిదాలను గణించడు. తోడివారిని 77సార్లు క్షమిస్తాడు - మత్త 18,22. అతడు తప్పలన్నేవాడు కాదు, తప్పలు సహించేవాడు.

కాని ఈ వాక్యానికి మరోలా కూడ అర్థం చెప్పవచ్చు. ఇతరుల తప్పిదాలను కప్పిపెట్టేది ప్రేమగల మానవుడు కాదు, దేవుడే అని కూడ అర్థం చెప్పవచ్చు. ఈ భావంకూడ బైబుల్లో అక్కడక్కడ తగులుతుంది. "దయగలవారు దయను పొందుతారు" - మత్త 5,7.