పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/120

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రేయస్సు కొరకు కృషి చేస్తుంది. ఎప్పడు గూడ సోదరప్రేమలో వుండే గుణం యిది - తోడివ్యక్తి అభివృద్ధిని సాధించడం. కనుక జ్ఞానం వలన గర్వం కలుగవచ్చు. కాని సోదరప్రేమ వలన మాత్రం తోడివారి అభివృద్ధికొరకు పాటుపడతాం.

24. ఇతరులను ప్రేమిస్తే ధర్మశాస్తాన్ని పాటించినట్లే - రోమా 18,8

తోడిజనాన్ని అంగీకరించి ఆదరిస్తే సువిశేషాలు బోధించే నైతిక ధర్మాలన్నీ పాటించినట్లే మోషే ధర్మశాస్త్రంలోని విధులన్నీ అనుసరించినట్లే, బైబులు భగవంతుడు జారీచేసిన చట్టాలన్నీ ఈ వొక్క ఆజ్ఞలోనే యిమిడి వున్నాయి.

అందుకే యాకోబు జాబుకూడ సోదరప్రేమను “రాజ శాసనం" అని పేర్కొంటుంది. అనగా ఇది శ్రేష్టమైన శాసనమనీ, ఇతర శాసనాలన్నిటినీ పరిపాలించేదనీ, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకొనేదనీ భావం. లేవీయకాండ 19, 18 పేర్కొంది ఈ శాసనాన్నే మార్కు 12,31 మత్త22,39 లూకా 10,27 పేర్కొంది కూడ ఈ యాజ్ఞనే. అన్నిటికంటె విలువైంది సోదరప్రేమ. కనుక క్రైస్తవుడు ఈ యాజ్ఞను తూచ తప్పకుండ పాటిస్తూండాలి.

25. క్రీస్తు ప్రేమ మనలను నిర్బంధిస్తుంది - 2కొ 5,14

ఇక్కడ "క్రీస్తుప్రేమ" అంటే క్రీస్తు మనపట్ల చూపిన ప్రేమకాదు. మనం ఆయనపట్ల చూపవలసిన ప్రేమ. ఆ ప్రభువు మనలను ప్రేమించి మనకోసం చనిపోయాడు. కనుక మన తరపున మనంకూడ ఆయన్ని గాఢంగా ప్రేమించాలి. మనం ఆయన దాసులమూ, సేవకులమూ కావాలి.

క్రీస్తు ప్రేమలో సిలువ వుంది. మరణం వుంది. కనుక మన ప్రేమలోకూడ ఈ లక్షణాలు వుండాలి. అతనికోసం మనం శ్రమలు అనుభవించ గలిగివుండాలి.

ఇక క్రీస్తుపట్ల మనం చూపవలసిన పేమ మనలను సోదరప్రేమకు పరికొల్పుతుంది. మనం ఆయనకోసం తోడిజనానికి సేవలు చేయాలని చెప్తుంది. ఇదే మన పేషితోద్యమం. ఈలా ప్రభువుపట్ల గల ప్రేమచేత మనం నానాజనానికీ నానా పరిచర్యలు చేస్తూండాలి.

26. ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు - రోమా 5,5

ప్రేమ అనేది మనంతట మనం సాధించేదికాదు. అది దైవవరం. తండ్రి తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తూంటాడు. ఇది మన జ్ఞానస్నానంలో జరగుతుంది. ఆత్మద్వారా జరుగుతుంది.