పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాను వారిని శిక్షింపడు. సహనంతో వుంటాడు. ఇది చేతగాని సహనం కాదు. మంచితనం వల్ల పట్టే సహనం. ఇక ప్రేమలేనివారిలో ఈ ఓర్పు అనేది వుండదు.

2. ప్రేమలో దయ వుంటుంది. ఇది ఇరుగుపొరుగువాళ్ళతో ఆప్యాయంగా మెలిగే గుణం. దయాపరుడైన నరుడు ఇతరులను ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. వాళ్ళకు సహాయం చేస్తాడు. తన కాలాన్నీ వస్తువులనూ డబ్బునూ తన్నుకూడ వాళ్ళకొరకు వ్యయం చేస్తాడు. క్రీస్తు ఈలాంటివాడు. కనుకనే పౌలు “అతడు నన్ను ప్రేమించి నాకోసం ప్రాణత్యాగం చేసికొన్నాడు" అని చెప్పాడు - గల 2.20

తరువాత సోదరప్రేమలో కన్పించని లక్షణాలు ఎన్మిది చెప్పాడు - 13,4-6. ప్రేమ మత్సరపడదు, డప్పాలు కొట్టదు, ఉబ్బిపోదు, అసభ్యంగా ప్రవర్తించదు, తన స్వార్గాన్నితాను చూచుకోదు, కోపపడదు, అపకారాలను మనస్సులో పెట్టుకోదు, కీడునుగూర్చి కాదు గాని మేలును గూర్చి సంతోషిస్తుంది. ఇక ఈ గుణాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. ప్రేమ మత్సరపడదు. ఆనాటి కొరింతు క్రైస్తవుల్లో ముఠాలు వుండేవి. ఒక మురాను జూచి మరో మురా అసూయపడేది. నిజమైన ప్రేమకలవాడు ఇతరుల కార్యక్రమాలనూ వృద్ధినీ చూచి సంతోషిస్తాడు. తానూ వాళ్ళతో కలుస్తాడు. ఈ ప్రేమ లేనివాళ్ళ ఇతరుల మంచిపనులనూ విజయాలనూ చూచి అసూయ చెందుతారు. తాము వాళ్ళతో కలియరు. ఈలా ఒకోమారు మనంచేసే మంచిపనులుకూడ క్రైస్తవ సమాజాల్లో విభజనను తెచ్చిపెడతాయి, అందుకే యాకోబు జాబు ఈర్యాద్వేషాలను అణచుకోవాలని చెప్తుంది - 3, 11 ఇతరుల కార్యాలను జూచి అసూయ చెందితే మనలో ప్రేమగుణం లోపించిందనే చెప్పాలి.

2. ప్రేమ డప్పాలు కొట్టదు. ఆనాటి కొరింతీయుల్లో కొందరు మాకు బోలెడంత మతజ్ఞానం వుందని డప్పాలు కొట్టేవాళ్ళ - 1 కో 8,1. తమకు కృపావరాలున్నాయని మిడిసిపడేవాళ్ళు డప్పాలు కొట్టేవాడిలో గంభీర గుణం వుండదు. నోటికి వచ్చినట్లల్లా వదరుతాడు. కాని సోదరప్రేమ కలవాడు ఈలా చేయడు. అతడు వినయంగా మేరమర్యాదలతో మెలుగుతాడు.

3. ప్రేమ ఉబ్బిపోదు. కొలిమి తిత్తుల్లోకి గాలి ఊదగానే అవి ఉబ్బిపోతాయి. ఆలాగే ప్రేమలేని మానవుడుకూడ ఉబ్బిపోతాడు. అతనికి పొగరెక్కుతుంది. ఆలాగే కొరింతీయులు కూడ తమ భాషల వరాన్ని జూచి ఉబ్బిపోయారు. అనగా గర్వపడ్డారు. కాని పేమగల మానవుడు ఈలాచేయడు. అతడు తనకు లేనిపోని గొప్పలు ఆపాదించుకోడు. సవినయంగా వుంటాడు.

93