పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని యిక్కడ మంచిచెడ్డలు తెలిసికోవడమంటే యేమిటి? ఆదామేవలు తమ మంచిచెడ్డ లేమిటో తామే నిర్ణయించుకో గోరారు. ఇక వాళ్ళకు దేవునితో సంబంధం వుండకూడదు. తాము స్వతంత్ర ప్రాణులు గావాలనీ, దేవునిమీద ఆధారపడకుండా వుండాలనీ భావించుకున్నారు. అసలు వాళ్ళు దేవుడంతటివాళ్ళు కావాలనీ, దేవునిలా వుండాలనీ కోరుకున్నారు. ఇలా దేవునికి సరిసమానులు కావాలని కోరుకోవడమే వాళ్ళ పాపంలోని ప్రధానాంశం.

ఇక, దేవునికి తుల్యలు కావాలని కోరుకోవడంలో ఉద్దేశమేమిటి? దేవుని అధికారాన్నిధిక్కరించడం. దేవునికి లొంగిఉండడం చేతగానితనమనీ, అవమానకరమనీ భావించడం. ఆదిదంపతులు తమ చిన్నరికాన్ని విస్మరించి దేవునిముందు తమ పెద్దరికాన్ని చాటుకోవడం. అతడు సృష్టికర్తయనీ, తాము కేవలం సృజింపబడిన ప్రాణులనీ మరచిపోవడం.

కావున కేవలం పండు తిన్నందుకుగాదు ఆదామేవలు పతనమైపోయింది. సృష్టిప్రాణులై యుండిగూడ సృష్టికర్తతో సమానంగా వుండాలని కోరుకున్నందుకు. వాళ్ళ పాపం విశేషంగా గర్వంతో గూడింది. మనలోని గర్వభావాన్నిగూడ అణచుకునే ప్రయత్నం చేద్దాం, ప్రార్థిద్దాం.]

3. దేవుడు మీరు చనిపోతారని చెప్పినమాట నిజంకాదు - ఆది 3,4

నేను తినవద్దనిన పండు తిన్నారో, మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు - 83. కాని దేవునిమాట నిజంకాదు, మీరు చనిపోరు అంది పాము. వెంటనే యేమకు అనుమానం కలిగింది. అమ్మో ఈ దేవుడెంత మోసగాడు అనుకుంది! తనలాగే మేమూ మంచిచెడ్డలు నిర్ణయించుకొని స్వతంత్రంగా జీవిస్తామని అసూయపడి దేవుడు ఆ చెట్టు పండు తినవద్దన్నాడు కాబోలు అని భావించింది. మేము అతనితో పోటీపడతామని తెలుసుకొని మమ్మ అణగద్రోక్కడానికే ఈ ప్రయత్నమంతా చేసాడు అనుకుంది.

ఇక్కడ యేవ దేవుణ్ణి కూడ తమలాంటి నరుణ్ణిగానే భావించుకుంది. తన కుటిలబద్ధిని ఆయనకీ ఆరోపించింది. కాని ఆమె అపోహ నిజంకాదు. నరుడు దేవునిమీద ఆధారపడతాడుగాని, దేవుడు నరునిమీద ఆధారపడడు. అతడు సర్వశక్తిమంతుడు కావడంచేత, ఇచ్చేవాడేగాని నరునినుండి పుచ్చుకునేవాడు కాడు. అందుచేత దేవుడు ఆదామేవలను గూర్చి అసూయపడడు. పడవలసిన అవసరంలేదు. వాళ్ళను వృద్ధిలోనికి తీసికొని రావాలనేదే అతని కోరిక.

ఈల్లా యేవ పాము మాటలు విని దేవుణ్ణి అపార్థం చేసికుంది, అతనికి దుష్టత్వాన్ని ఆరోపించింది. ఈ యారోపణ ద్వారా తన దుష్టత్వాన్నే వెల్లడిచేసుకుంది. ఈ దుష్టాలోచనమే ఆదామేవల పాపంలోని వరోరాంశం. మన హృదయంలోని కుటిల భావాలను తలంచుకొనిగూడ పశ్చాత్తాప పడదాం.