పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/84

ఈ పుట ఆమోదించబడ్డది



2. ప్రభువు విమోచకుడు

విమోచనం బైబుల్లో ఓ పెద్దభావం. ఇది ఐగుప్తీన యూదుల బానిసం సందర్భంలో ప్రారంభమౌతుంది. పూర్వవేదమంతట కన్పిస్తుంది. నూత్నవేదంలోను గోచరిస్తుంది. ప్రస్తుత వ్యాసంలో ఈ భావాన్ని కొంచెం విపులంగా పరిశీలించిచూద్దాం.

1. విమోచకుడు

విమోచకుడు అంటే ఆపదనుండి విడిపించేవాడు లేక రక్షించేవాడు అని అర్థం. ఇతడు దగ్గరి చుట్టం, తన బంధువులకు మేలు చేసేవాడు. హీబ్రూ భాషలో ఇతన్ని "గోయెల్", అనేవాళ్లు. పూర్వవేదంలో విమోచకుడు మూడు పనులు చేసిపెట్టేవాడు. 1) యూదుల్లో ఎవరైనా పేదవాళ్లయిపోయి తమ ఆస్తిని కోల్పోతే వాళ్ళదగ్గరి చుట్టమయిన విమోచకుడు మల్లా వాళ్ళకు ఆ యాస్తిని సంపాదించి పెట్టేవాడు. అనగా అతడు ఆ పొలాన్ని మల్లా కొని దాన్ని సొంతదారులకు ముట్టజెప్పేవాడు - లేవీ 25,25, 2) ఆలాగే యూదుల్లో ఎవరైనా బానిసలై పోతే దగ్గరిచుట్టమయిన విమోచకుడు వాళ్ళను ఆ బానిసాన్నుండి విడిపించేవాడు - లేవీ 25, 47-49. యావే ఈ రెండవ అర్థంలో విమోచకుడు ఔతాడు. 3) ఎవరినైనా శత్రువులు చంపివేస్తే ఆ చంపబడినవారి దగ్గరిచుట్టం విమోచకుళ్లాగ ప్రవర్తించి శత్రువుల మీద పగ తీర్చుకోవాలి - సంఖ్యా 35, 19. ఇవి ప్రాచీన యూద సమాజంలో ప్రచారంలో వున్న భావాలు.

2. యావే విమోచకుడు

ఇక యావే ఐగుప్తులోని యిస్రాయేలు ప్రజలు పట్ల విమోచకుళ్ళాగా మెలిగాడు - నిర్గ 6,6 కీర్త 77, 15 ఏలాగ? యిప్రాయేలీయులను ఫరో చక్రవర్తి బానిసలనుగా ఏలుతున్నాడు. వాళ్ళను ముప్పతిప్పలు పెడుతూన్నాడు. అప్పడు ప్రభువుకి ఆ ప్రజలమీద జాలికలిగింది. తాను వాళ్ళకు దగ్గరిచుట్ట మయ్యాడు. ఫరో దాస్యాన్నుండి ఆ ప్రజలను విడిపించాడు.

మామూలుగా యిప్రాయేలు విమోచకులు బానిసలుగా అమ్ముడుపోయిన బంధువులను విడిపించడానికి వాళ్ళ యజమానులకు డబ్బుచెల్లించేవాళ్లు, కానియిస్రాయేలు ప్రజను విడిపించడానికి యావే ఫరోకు సొమ్ము ఏ మాత్రమూ చెల్లించ లేదు. ఫరోకు ధనమిచ్చి గాక, అతన్ని అణగ ద్రోక్కి ప్రభువు యిప్రాయేలును విడిపించుకొని వచ్చాడు. కనుకనే అతడు మోషేతో "ఫరో రాజనీ అతని రధాలనూ అశ్వాలనూ సైన్యాలనూ నాశం చేసి నా మహిమను ప్రదర్శిస్తాను” అంటాడు - నిర్గ 14,18.