పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

పిడికెడు మట్టినుండి నరుణ్ణి చేసాడు. అతనికి ఓ మంచి వాతావరణం కలిగించి ఓ తోటలో వుంచాడు. తోడుగా వుండడానికి ఒక స్త్రీని కూడ ఇచ్చాడు. అతన్ని తనకు స్నేహితునిగా జేసికొన్నాడు. తన కుమారునిగా స్వీకరించాడు. ఐనా నరుడు కృతఘ్నుడై దేవుని ఆజ్ఞమీరాడు. తలబిరుసుతో దేవుణ్ణి ధిక్కరించాడు, పాపంచేసాడు. తత్ఫలితంగా అతడు మృత్యువు వాతబడ్డాడు, మంటగలసిపోయాడు.

ఈ పట్టున భగవంతుని జాలిని తెలియజేసే వాక్యం ఒకటి విన్పిస్తుంది. దేవుడు జంతుచర్మాలతో గుడ్డలుచేసి ఆదామేవలకు తొడిగాడు — 3, 21. అంటే ప్రభువు ఆపాపపు మానవుల పట్లగూడ కనికరమూ ఆదరమూ చూపాడని భావం.

4. నరుడు అమరుడై పోతాడేమోనని

ఆదాము జీవవృక్ష ఫలాలు కోసికొని తిని అమరుడై పోతాడేమోనని దేవుడు అతన్ని తోటలోనుండి వెళ్లగొట్టాడు 3, 23. అనగా ఆదామునకు అమరత్వం పోయింది. అతడు చావునకు గురయ్యాడు.

దేవుడు ఏదెను తోటకు తూర్పుగా దేవదూతలను నిల్పాడు — 3, 24. ఈ దేవదూతలకు మూలంలో కెరూబులని పేరు. యిప్రాయేలీయులకు సమీప జాతులైన కనానీయులు మొదలైనవాళ్ల మతాల్లో ఈ కెరూబులు క్షుద్రదేవతలు. వీళ్లు దేవాలయాలను కాపాడుతూ పెద్దపెద్ద దేవతలకు అంగరక్షకులుగా పనిచేస్తుంటారు. ఆలాగే ఇక్కడ కూడ దేవదూతలు నరుని నుండి తోటను కాపాడారని చెప్పబడింది.

గుండ్రంగా తిరుగుతూ నిప్పలు కక్కే కత్తినికూడ దేవుడు తోటకు కావలి వుంచాడు. దేవతల ఆయుధం పిడుగు. ఇక్కడ ఈ కత్తి ఓపిడుగులాగ పనిచేసి నరుణ్ణి తోటలోనికి రానీకుండా వారిస్తుంది. అనగా నరుడు తన తొల్లింటి సౌఖ్యాన్ని శాశ్వతంగా కోల్పోయాడనీ ఇక అతనికి అమరత్వం లేదనీ భావం.

5. నరుని పాపం

ఆదాము పాపం ఏమిటి? అతడు దేవుడు నిషేధించిన పండు తిన్నాడని మాత్రం చెప్పబడింది. అసలు ఆదాము పండు తిననూ లేదు పెట్టనూ లేదు. ఈ పండు ఓ సంకేతం మాత్రమే. ఆదాము దేవుని ఆజ్ఞమీరి ఏమో చేసాడని దీని భావం.

కాని ఆదిదంపతులు యథార్థంగా చేసిన పాపం ఏమిటి? అది యెవ్వరికీ తెలియదు. ఆదికాండం వ్రాసిన రచయితకు కూడ తెలియదు. కాని ఒకటి మాత్రం నిజం. ఆదాము గర్వముతో దేవుని ఆజ్ఞ మీరాడు. తాను పరతంత్రప్రాణి ఐకూడ