పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/53

ఈ పుట ఆమోదించబడ్డది

2. నరుడు

1. బహువచన ప్రయోగం

మొదట యాజక సంప్రదాయంవాళ్ల భావాలతో ప్రారంభిద్దాం. దేవుడు "మనకు పోలికగా, మన ఆకారంలో నరజాతిని సృజిద్దాం" అనుకొన్నాడు – 1, 26. ఇక్కడ దేవునికి "మన" అని బహువచనం వాడడం దేనికి? దేవుల్లో ముగ్గురు వ్యక్తులు ఉండబట్టా? పూర్వవేద ప్రజలకు సుతునిగూర్చీ పరిశుద్దాత్మను గూర్చీ తెలియనే తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా పిత అనబడే ఒక్క దైవవ్యక్తిని గూర్చి మాత్రమే. కనుక ఈ వాక్యంలోని బహువచనం ముగ్గురు దైవ వ్యక్తులను గాదు, దేవుళ్లీ, దేవదూతలనూ సూచిస్తుంది. ఇక్కడ దేవుడు తన దూతలతో మంత్రాలోచనం చేసినట్టుగా భావించుకోవాలి.

2. పోలిక, ఆకారం

దేవుడు నరుడ్డి తనకు పోలికగాను, తన ఆకారంలోను సృజించాడు -1, 26. ఇక్కడ పోలిక అన్నా ఆకారమన్నా ఒక్కటే. నరుడు దేవునికి పోలికగా వుంటాడు, దేవునిలాగా వుంటాడు. నేలమీది ప్రాణులన్నిటికంటె అధికంగా నరుడు దేవుని పోలివుంటాడు. అతనిలో వున్నంత దేవుని పోలిక మరే ప్రాణిలోను వుండదు. కనుక అతన్ని చూస్తే దేవుణ్ణి చూచినట్లే. కాని నరుడు దేనిలో దేవుణ్ణి పోలివుంటాడు?

నరుడు దేహంలోను, ఆత్మలోను కూడ దేవుణ్ణి పోలివుంటాడు. మృగాలన్నిటికీ తల భూమివైపునకు వంగివుంటుంది. అవి నేలవైపు చూస్తుంటాయి. కాని నరునితల నిలువుగా నిలబడి వుంటుంది. అతడు పైకి చూస్తుంటాడు. ఈ నేలమీది ప్రాణులన్నిటిలోను అతడు మాత్రమే దేవునివైపు చూడగలడు, దేవుడ్డి తలంచుకోగలడ.

నరునిలో బుద్ధిశక్తీ, చిత్తశక్తి వున్నాయి. అనగా అతనిలో తెలివితేటలున్నాయి, అతడు ప్రేమించగలడు. పైగా అతడు సృష్టి ప్రాణులపై అధికారం నెరపగలడు. అతనిలో స్వాతంత్ర్యం కూడ వున్నది. ఈలా బుద్ధిశకీ, చిత్తశక్తీ, అధికారశక్తి, స్వాతంత్ర్యశక్తి అనే గుణాలన్నిటిలోను అతడు దేవుణ్ణి పోలివుంటాడు. 8వకీర్తన 5 -8 వచనాలు ఈసత్యాన్నే ఉగ్గడిస్తాయి. ఐతే అన్నిటికంటె మిన్నగా నరుడు అధికారం నెరవడంలో దేవుణ్ణి పోలివుంటాడు. దేవునికి ప్రతినిధిగా వుండి అతడు భూమి మీద ప్రాణులన్నిటినీ పరిపాలిస్తుంటాడు.

దేవుడు ఆదామని తనకు పోలికగా చేసాడు అన్నాం. దేవుని కుమారుడైన క్రీస్తు కూడ ఆదేవునికి పోలికగావుంటాడు - కొలో 1, 15. కనుక ఇక్కడ ఆదాము దేవునికి పోలికగా ఉన్నాడు అంటే అతడుకూడ దేవుని కుమారుడేనని భావం. “దేవునిపోలిక? అన్న మాటల్లో ఈభావాలన్నీ ఇమిడివున్నాయి.