పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/306

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదహింసల్లో క్రీస్తు ఆత్మ మలను ఉత్తేజపరుస్తుంది. శత్రువులకు మనం ఎలా జవాబు చెప్పాలో తెలియజేస్తుంది. క్రీస్తు కొరకు ప్రాణాలర్పించే ధైర్యాన్ని కూడ ప్రసాదిస్తుంది. ఈ దివ్యశక్తితో మనం శ్రమలకు తట్టుకొని నిలుస్తాం.

ముగింపు

పైన ఎన్మిది ధన్యవచనాలను చూచాం. క్రీస్తు స్వయంగా ఈ యెన్మిదింటిని పాటించాడు. అతడు దీనాత్ముడుగా తండ్రి మీద ఆధారపడి జీవించాడు. మన పాపాలను తన భుజస్కంధాలపై భరించి శోకార్తుడుగా వాటి కొరకు దుఃఖించాడు. వినమ్ర హృదయుడుగా ఆ తండ్రి ఆజ్ఞకు లొంగాడు. నరులంతా దేవుని నీతిని, దేవుని రక్షణాన్నీ పొందాలని తపించిపోయాడు. దయామయుడు కనుక శత్రువులను గూడ క్షమించాడు. నిర్మల హృదయంతో నిరంతరం తండ్రి ముఖాన్ని అవలోకించాడు. సమాధానకర్తగా వచ్చి దేవునికీ నరులకూ మధ్య శాంతిని నెలకొల్పాడు. నానా హింసలకు గురై సిలువపై వేలాడాడు. తాను రక్షణాన్ని పొంది మనకూ దాన్ని సంపూర్ణంగా దయచేసాడు. కనుక ధన్యతలన్నిటినీ అతడు పరిపూర్ణంగా జీవించాడు.

ఈలా ధన్యత లన్నిటినీ జీవించిన క్రీస్తు వాటి బహుమానమైన దైవరాజ్యాన్ని గూడ పరిపూర్ణంగా పొందాడు. అసలు అతడే దైవరాజ్యం. అతడే నిజమైన ధన్యవచనం.

ఈ విధంగా ధన్యవచనాలను జీవించిన క్రీస్తు నేడు మనంకూడ వాటి ప్రకారం జీవించేలా చేస్తాడు. క్రీస్తు ఆత్మ అతని రూపాన్ని మనలో చిత్రిస్తూంటుంది. అతని లాగే మనంకూడా ధన్యవచనాలను పాటించేలా చేస్తుంది.

ఈ యెన్మిది ధన్యతలు పెద్ద అద్దం లాంటివి. ఈ యుద్ధంలోనికి చూచుకొని మనలను మనం చక్కదిద్దుకొంటూండాలి.

ఈ ధన్యవచనాలను మననంచేసికొంటే మన ఆలోచనల్లో, పనుల్లో మార్పు వస్తుంది. దేవునిపట్ల అధిక భక్తితో మెలుగుతాం. తోడివారిపట్ల ఎక్కువ ప్రేమతోను దయతోను ప్రవర్తిస్తాం. ఇది అల్ప లాభమేమీ కాదు.