పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/305

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు కొరకు హింసలను భరించేవాళ్లు దైవరాజ్యాన్ని పొందుతారు. ఈ దైవరాజ్యం మోక్షమే. పూర్వ ప్రవక్తలైన యెషయా యిర్మీయా మొదలైనవాళ్లు, క్రీస్తు, ఆ పిమ్మట సైఫనునుండి నేటి వరకు వచ్చిన వేదసాక్షులు శ్రమలనుభవించారు. క్రీస్తు శ్రమలను భరించి తన మహిమలో ప్రవేశించడం అనివార్యం అన్నాడు ప్రభువు - లూకా 24,26. ఈ వేదసాక్షుల్లాగే నేడు మనం కూడ బాధలు అనుభవించాలి. వీటి ఫలితమే మోక్షం.

అన్వయం

ఈ జీవితంలో శ్రమలు అవసరం. హింసలకు గురైనపుడు దేవుణ్ణి తలంచుకొని అతన్ని శరణు వేడుతాం. హింసలే లేకపోతే దైవరాజ్యానికి బదులుగా మన సొంతరాజ్యాన్ని నిర్మించుకొంటాం.

మతహింసలు ఎందుకు వస్తాయి? క్రీస్తు శిష్యులమైనందుకే. లోకం పూర్వం క్రీస్తుని ద్వేషించింది. ఇప్పడు అతని శిష్యులను కూడ ద్వేషిస్తుంది. యోహా 15,18-20 కనుక వేదహింసలు క్రైస్తవ జీవితంలో ఓ ముఖ్యభాగం అనుకోవాలి.

మనం ఎప్పడూ క్రీస్తు పేరుమీదగానే హింసలకు గురికానక్కరలేదు. ఆ క్రీస్తు పేరుమీదిగా న్యాయాన్ని పేదల హక్కులనూ నెలబెట్టడానికి పోరాడినపుడు కూడ శ్రమల వాత బడవచ్చు. ఉత్తర భారతంలో సిస్టరు రాణి మరియ, ఫాదర్ తోమస్ మొదలైనవాళ్ళు పేదల హక్కుల కొరకు పోరాడి ప్రాణాలు కోల్పోయారు.

వేదహింసల్లో చాలా మెట్లున్నాయి. అసౌకర్యాలకూ నష్టాలకూ గురికావడం క్రిందిమెట్టు. కాని ప్రాణాలు కోల్పోవడం తుదిమెట్టు. ఇదే వేదసాక్షి మరణం. తొలినాటి క్రైస్తవులు వేదసాక్షిగా మరణించడం క్రైస్తవ జీవితానికి ముఖ్యలక్షణం అనుకొన్నారు. కాని కాలక్రమేణ ఈ భావం మరుగుపడిపోయింది.

వేదహింసలను అనుభవించడంలో క్రీస్తే మనక ఆదర్శం. అతడు న్యాయం కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, నరులపాపాలకు పరిహారం చేయటం కొరకు, దైవరాజ్యస్థాపనం కొరకు హింసలు అనుభవించాడు. నెత్తురు చిందించి తన ప్రాణాన్ని అర్పించడానికీ, నీచమైన సిలువ మరణానికీ పాల్పడ్డాడు. ఆ వేదసాక్షి హింసలు మనకు ఆదర్శంగాను ప్రేరణంగాను వుంటాయి. క్రీస్తు మన కొరకు బాధపడి, అతని అడుగుజాడల్లో నడవడానికి మనకు ఓ ఆదర్శాన్ని చూపించాడు - 1 పేత్రు 2-21.

క్రీస్తు శారీరక శ్రమలు మాత్రమేకాక అతని ఆంతరంగిక భావాలు కూడ మనకు ప్రేరణం కలిగిస్తాయి. మొదటిది, అతడు తండ్రికి విధేయుడై మన కొరకు శ్రమలు అనుభవించాడు. రెండవది, మనపై గల ప్రేమచే బాధలు అనుభవించాడు. ఈ యాంతరంగిక గుణాలు లేందే అతని సిలువమరణం మనలను రక్షించివుండదు. నేడు మన శ్రమల్లో గూడ మనం దేవుని చిత్తానికి లొంగడం, సోదరప్రేమను పాటించడం ముఖ్యం.