పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/303

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


7. శాంతిస్థాపకులు - దేవుని కుమారులు

కలహాలు ద్వేషాలు ప్రజలను విభజిస్తాయి. శాంతిస్థాపకులు ఈ తగాదాలను అణచివేసి, చీలిపోయిన ప్రజలను ఐక్యపరుస్తారు. విడిపోయిన వాళ్ళను రాజీ కుదిర్చి వాళ్ళు ఒకరితో ఒకరు ఒద్దికగా జీవించేలా చేస్తారు. కొన్నిసార్లు ప్రజలు హింసలకు దౌర్జన్యాలకూ పాల్పడతారు. ఈ పరిస్థితుల్లో శాంతికాముకులు ద్వేషాలను తొలగించి శాంతిసమాధానాలు నెలకొల్పుతారు. దీనివల్ల ప్రజలకు క్షేమం కలుగుతుంది. కనుక శాంతిని నెలకొల్పడమంటే కేవలం కలహాలను తొలగించి రాజీని కుదర్చడం మాత్రమే కాదు. జనానికి క్షేమమూ, అధివృద్ధి కలిగేలా చూడ్డం కూడ. కావున శాంతిస్థాపనం గొప్ప కార్యం. ప్రజాక్షేమం, ప్రజాశ్రేయస్సు నెలకొల్పడం.

శాంతిస్థాపకులకు లభించే బహుమతి యిది. వాళ్లు దేవుని కుమారులుగా చలామణి ఔతారు. ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవునిలాంటివాడు కావడం. క్రీస్తు దేవుని కుమారుడు. ఈ క్రీస్తు ద్వారానే శాంతిప్రియులు తండ్రికి ప్రీతిపాత్రులౌతారు. మనలను దేవుని కుమారులనుగా జేసేది క్రీస్తే.

క్రీస్తుకి శాంతికరుడైన రాజు అని పేరు - యెష9,6. అతడు దేవునికీ నరులకూ మధ్య శాంతిని నెలకొల్పేవాడు. అతని సిలువ మరణం ద్వారా తండ్రి పరలోక భూలోకాలను తనతో సమాధానపరచుకొన్నాడు - కొలో 1,20. క్రీస్తు మరణానికి ముందు యూదులకూ అన్యజాతి ప్రజలకు ఐక్యతలేదు. క్రీస్తు తన మరణం ద్వారా ఈ రెండు వర్గాల ప్రజలను కలిపివేసాడు. అందరి పాపాలకు పరిహారంజేసి అందరినీ దేవుని బిడ్డలనుచేసాడు. యూదులకు అన్యులకూ మధ్య వుండే అడ్డుగోడను తొలగించాడు. కనుక అతడు జగత్తుకే శాంతిని ప్రసాదించినవాడు - ఎఫే 2,14-15. ఈ క్రీసులాగే మనంకూడ శాంతికాముకులం, శాంతిని నెలకొల్పేవాళ్ళం కావాలి.

అన్వయం

నరులు కలిసిమెలసి సామరస్యంగా జీవించాలి. అన్యాయాలు, హింసలు, దౌర్జన్యాలు ఈ సామరస్యాన్ని చెరుస్తాయి. కనుక శాంతిస్థాపకులు ఈ యన్యాయాలను ఎదిరించి పోరాడవలసి వుంటుంది. ఇది కష్టమైన కార్యం. ఆనాడు యూద సమాజంలోని అన్యాయాలనూ మతాధికారుల అక్రమాలనూ ఎదిరించడం వల్లనే క్రీస్తుకి మరణం దాపురించింది. నేడు శాంతిని నెలకొల్పాలనుకొనేవాళ్ళకు కూడ ఈ యపాయం వుంది.

సమాధానాన్ని నెలకొల్పాలంటే తప్పకుండా పోరాటానికి దిగనక్కరలేదు. నరులు ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా గూడ సమాధానం నెలకొంటుంది. కనుక శాంతిని కోరేవాళ్ళ ప్రజలకు ఈ క్షమాగుణాన్ని నేర్పాలి. కొన్నిసార్లు సంప్రతింపుల ద్వారా గూడ