పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/302

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయంలోకి పగ, అసూయ, డంబం, దుష్టత్వం మొదలైన దుష్టభావాలు రాగానే వాటిని ప్రక్కకు నెట్టివేయాలి. నేను ఈ భావాలకు లొంగిపోతే దేవుణ్ణి దర్శించలేను అనుకోవాలి”.

అన్వయం

నిర్మల హృదయాన్ని అలవర్చుకోవడం ఏలా? అనన్యచిత్తంతో దేవుణ్ణి సేవించాలి. పూర్వవేదంలో యావే ప్రభువు తన్ను మాత్రమే కొలవండని యూదులను ఆజ్ఞాపించాడు - ద్వితీ 6,5. నూత్న వేదంలో క్రీస్తు ఇద్దరు యజమానులను సేవించవద్దన్నాడు. అవి దేవుడూ, ధనం - మత్త 6,24. అనగా మన విలువలన్నిటిలో భగవంతుడు పై విలువ కావాలి.

నరుడు దైవచిత్తానికి లొంగి జీవించాలి. తన యిష్టప్రకారం తాను జీవించకూడదు. దైవాజ్ఞలను పాటించాలి. ఈలా జీవించే నరుడు దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని కోరికల ప్రకారం జీవిస్తాడు.

నిర్మల హృదయుడి మనసు దుష్టాలోచనలకు లొంగదు. యూదులు ఆరాధనలో శారీరక శుద్ధిని ఘనంగా యెంచుతున్నారు. కాని క్రీస్తు నైతికశుద్ధి ముఖ్యమని వాకొన్నాడు. హృదయం నరహత్య, వ్యభిచారం, దొంగతనం, కూటసాక్ష్యం, పరదూషణం మొదలైన భావాలకు లొంగకూడదన్నాడు. ఈ దుష్టాలోచనలు తర్వాత క్రియలై మనిషిని మైలపరుస్తాయి. కనుక మన మనసు ఎప్పడు పవిత్రంగా వుండాలి — మత్త 15,19-20.

కాని మనసుని నిర్మలంగా వుంచుకోవడం అంత తేలికకాదు. చాలసార్లు పడిపోతాం. అప్పుడు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి పాపసంకీర్తనం చేసికోవాలి. ఈ సంస్కారం మన మనసులోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది.

హృదయం నిర్మలంగా వుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. కష్టాల్లో వున్నా కూడా హృదయం శాంతిని పొందుతుంది. డొక్కశుద్ధి లేనివాడికి ఎన్ని సంపదలున్నా ఎన్ని సుఖాలున్నా హృదయశాంతి వుండదు.

ప్రార్ధనద్వారా నిర్మల హృదయాన్ని పొందుతాం. అది మనకు దేవుని వరప్రసాదాన్ని సంపాదించి పెడుతుంది. మన మనసుని కడిగి శుద్ధిచేసేది, దాన్నిదేవునిపై లగ్నంచేసేది వరప్రసాదమే. కనుక భక్తుడు ప్రధానంగా దైవానుగ్రహాన్ని సంపాదించాలి.

మన హృదయం నిర్మలం కావాలంటే క్రీస్తు హృదయం దానిమీద సోకాలి. అతని హృదయం దయాపూరితమైంది. వినప్రమమైంది. ఎప్పడూ తండ్రినీ నరులనూ ప్రేమించేది. ఈ దివ్య హృదయం మన పాపపు హృదయాన్ని తాకి దాన్ని పునీతం చేస్తుంది. దేవా! నాలో నిర్మల హృదయాన్ని సృజించు అని ప్రార్ధించాడు కీర్తనకారుడు - 51,10.
వేమన గొప్ప నిజాయితీగల కవి. అతడు చిత్తశుద్ధిలేని శివపూజ లేల, భాండశుద్ధిలేని పాకమేల అన్నాడు. మురికి కుండలో మంచిభోజనం వండినా ఎవరికీ రుచించదు. అలాగే మలిన హృదయంతో పూజలు చేసినా అవి దేవునికి నచ్చవు.