పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/301

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అన్వయం

తోడివారిపట్ల కనికరం జూపితేనేగాని మనకు రక్షణం లేదు. మత్తయి 25లో వచ్చే తుదితీర్పు కథ ఈ సత్యాన్నే వెల్లడిచేస్తుంది. ఈ కథలో వచ్చే సజ్జనులు ఆకలిగొన్నవారికి కరుణతో అన్న పానీయాలిచ్చారు. ఇల్లు లేనివారికి వసతి, బట్టలులేనివారికి దుస్తులు ఇచ్చారు. రోగులను, చెరలో వున్నవారిని, పరదేసులను పరామర్శించారు. ఇవన్నీకరుణ కార్యాలు. ఇంకా పేదలకు దానధర్మాలు చేయడం, చనిపోయినవారిని పాతిపెట్టడం మొదలైనవి కూడ కరుణకార్యాలే. దేవుడు ఈ కార్యాలన్నిటినీ తనకు చేసినట్లే భావించి సజ్జనులకు మోక్షభాగ్యాన్ని దయచేసాడు. దుష్టులు ఈ కరుణకార్యాలు చేయనందుకు వారికి నరకశిక్ష పడింది. తోడివారి పట్ల దయ జూపాలి అనడానికి ఇంతకంటె మంచి ఉదాహరణం ఏమి కావాలి? కనికరం లేనివానికి దేవుడు కనికరం లేని తీర్పు తీరుస్తాడు - యాకోబు 2, 13.

మన రోజువారి జీవితంలో ఇతరుల పట్ల కరుణతో, ప్రీతితో మెలగాలి. మాటకు మాట అనకూడదు. చెడ్డకు చెడ్డ చేయకూడదు. క్రీస్తులాగ, సైఫనులాగ మనం కూడ శత్రువులు కొరకు ప్రార్ధించాలి. ఇతరులు తెలిసీతెలియక చేసిన కీడులను మన్నించాలి. వారి పట్ల వైరం, ప్రతీకారబుద్ధి పెంచుకోగూడదు. తనలోని రాక్షసగుణాన్ని స్వార్గాన్ని అణచుకొన్నవాడేగాని దయతో ప్రవర్తించలేడు. లూకా సువిశేషం “మీ తండ్రిలాగే మీరూ కనికరం గలవారై వుండండి" అంటుంది – 6,36.

6. నిర్మల హృదయులు - దైవదర్శనం

ఇక్కడ నిర్మలత్వం అంటే ఆరవ ఆజ్ఞకు వ్యతిరేకమైన పాపాలు చేయకుండ ఉండడమని భావం కాదు. ఈ ధన్యవచనం పేర్కొనే నిర్మలత్వం చాల విశాలమైంది. దేవుని పట్ల నరుల పట్లగూడ నిజాయితీతో ప్రవర్తించడమని ఇక్కడ ఈ మాటకు అర్థం. దీన్నే చిత్తశుద్ధి, లేక హృదయశుద్ధి అంటాం. అనగా మన అంతరంగం లేక అంతరాత్మ చెప్పినట్లుగా నడచుకోవడం, వంచన, కపటం, మోసం లేకుండ ఉండడమన్నమాట.

ఈ చిత్తశుద్ధిని గూర్చి కీర్తన 24, 3–4 చరణాలు ఈలా చెప్తాయి. "ప్రభువు పర్వతాన్ని ఎక్కడానికి అరుడైవడు? దుప్రియలు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు, విగ్రహాలను ఆరాధించనివాడు, దొంగ ప్రమాణాలు చేయనివాడు ఎవడో అతడే". ఇంకా 15వ కీర్తనగూడ ఈ చిత్తశుద్ధిని విపులంగా వర్ణిస్తుంది. “యావే మందిరంలో వసింపగలవాడెడు? నిందారహితంగా జీవించేవాడు, ధర్మాన్ని పాటించేవాడు, హృదయపూర్వకంగా సత్యాన్ని పలికేవాడు".

ఈలా నిజాయితీతో జీవించే నిర్మల హృదయులు దేవుణ్ణి దర్శిస్తారు. ఈ లోకంలో అతన్ని కొంతవరకు చూస్తారు. పరలోకంలో సంపూర్ణంగా దర్శిస్తారు - 1 కొ 13, 12. నాల్గవ శతాబ్దంలో జీవించిన పక్కోమియస్ అనే భక్తుడు ఈలా వ్రాసాడు - "మన